GV Prakash Kumar: పెట్టింది 20 కోట్లు... కానీ వచ్చింది 5 కోట్ల చిల్లరే!

- జీవీ ప్రకాశ్ కుమార్ హీరోగా 'కింగ్ స్టన్'
- మార్చి 7న థియేటర్లలో విడుదల
- వసూళ్ల పరంగా నిరాశపరిచిన సినిమా
- జీ 5లో ఈ నెల 4 నుంచి స్ట్రీమింగ్ అంటూ టాక్
తమిళంలో హీరోగా జీవీ ప్రకాశ్ కుమార్ కి మంచి క్రేజ్ ఉంది. ఒక వైపున హీరోగా... మరో వైపున సంగీత దర్శకుడిగా బిజీగా ఉన్నాడు. అప్పుడప్పుడు నిర్మాతల జాబితాలో కూడా ఆయన పేరు కనిపిస్తోంది. ఆయన నుంచి ఇటీవల వచ్చిన సినిమానే 'కింగ్ స్టన్'. అడ్వెంచర్ తో కూడిన ఫాంటసీ హారర్ మూవీ ఇది. కమల్ ప్రకాశ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి జీవీ ప్రకాశ్ కుమార్ కూడా ఒక నిర్మాతగా ఉన్నాడు.
మార్చి 7వ తేదీన థియేటర్లకు ఈ సినిమా వచ్చింది. అయితే ఆశించినస్థాయిలో ఆడియన్స్ కి ఈ సినిమా కనెక్ట్ కాలేదు. 20 కోట్ల బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమా, 5.35 కోట్లను మాత్రమే రాబట్టగలిగింది. దీనిని బట్టి పెద్ద మొత్తంలోనే నష్టాలు తెచ్చిపెట్టిందనే విషయం అర్థమవుతూనే ఉంది. అలాంటి ఈ సినిమా ఈ నెల 4వ తేదీ నుంచి, నాలుగు భాషల్లో 'జీ 5'లో స్ట్రీమింగ్ కానున్నట్టుగా తెలుస్తోంది. దివ్యభారతి, నితిన్ సత్య, అళగమ్ పెరుమాళ్, చేతన్ ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు.
కథ విషయానికి వస్తే... అది సముద్రతీరంలోని ఒక జాలరి గూడెం. కొంతకాలంగా చేపల వేటకి వెళ్లినవారెవరూ వెనుతిరిగి రారు. ఆ సముద్రంపై చనిపోయిన ఒక వ్యక్తి ఆత్మ అందుకు కారణమనే ప్రచారం జరుగుతూ ఉంటుంది. మళ్లీ అందరూ పనిలోకి వెళ్లాలంటే, ఆ ప్రచారంలో నిజం లేదని నిరూపించాలి. అందుకోసం బయల్దేరిన హీరో ఎలాంటి సవాళ్లను ఎదుర్కోవలసి వస్తుంది? అనేది కథ.