L R Eswari: ఎవరు తీసుకుపోయేది ఏమీలేదు: గాయని ఎల్ ఆర్ ఈశ్వరి!

- బాల్యం బాధల్లో గడిచిందన్న గాయని
- తన తొలి పారితోషికం 300 అని వెల్లడి
- బాలు మనసు ఎంతో గొప్పదని వ్యాఖ్య
- లైఫ్ హ్యాపీగా సాగిపోతుందని వివరణ
1960 - 80 మధ్య కాలంలో గాయనిగా ఎల్.ఆర్.ఈశ్వరి 5 భాషలలో అనేక పాటలు పాడారు. జ్యోతిలక్ష్మి .. జయమాలిని .. సిల్క్ స్మిత .. ఇలా అనేక మంది శృంగార తారలకు సంబంధించిన పాటలను ఎక్కువగా పాడారు. తాజాగా 'సుమన్ టీవీ'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తనకి సంబంధించిన అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. "నేను పుట్టిపెరిగింది చెన్నైలోనే. నా 8వ ఏట మా ఫాదర్ చనిపోయారు. కోరస్ పాటల ద్వారా వచ్చిన డబ్బుతో మా అమ్మగారు ఇల్లు నడిపేది" అని అన్నారు.
"బాలుగారితో కలిసి చాలా పాటలు పాడాను. బాలు చాలా కష్టపడి పైకొచ్చారు. పెద్దవాళ్లను గౌరవించడం ఆయనకి బాగా తెలుసు. ఎక్కడ కనిపించినా చాలా ఆత్మీయంగా పలకరించేవారు .. సరదాగా మాట్లాడేవారు. ఒక్క మాటలో చెప్పాలంటే బాలు .. బంగారం అంతే. ఆయన లేరు అనే మాటనే నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఇక లేడీ సింగర్స్ తో కలిసి పాడిన పాటలు కూడా ఉన్నాయి. అయితే ఎవరూ ఎవరినీ మెచ్చుకునేవారు కాదు. ఎవరి పోర్షన్ వారు పాడుకుని వెళ్లిపోయేవాళ్లం" అని చెప్పారు.
"నా మొదటి పాటకి ఇచ్చిన పారితోషికం 300. ఆ పారితోషికం వెయ్యి రూపాయలు కావడానికి చాలా కాలం పట్టింది. నేను అభిమానించే గాయనీమణులలో వాణీ జయరాం ఒకరు. 19 భాషలపై ఆమెకి పట్టు ఉంది. అలాంటి ఆమె హఠాత్తుగా అలా చనిపోతారని ఎవరూ ఊహించలేదు. మనం సాధించినది .. సంపాదించినది మరొకరికి ఉపయోగపడాలనే స్వభావం నాది. పోతూ పోతూ ఎవరు తీసుకుపోయేది ఏమీలేదు... అందువల్లనే నేను సంపాదించినది పంచడం జరిగిపోయింది. లైఫ్ హ్యాపీగానే సాగిపోతోంది" అని చెప్పారు.