SP Charan: నేను బాలూగారి అభిమానిని: ఎస్పీ చరణ్!

- గాయకుడిగా బాలూగారి స్థాయివేరన్న చరణ్
- ఆ ప్రయాణం మరొకరికి సాధ్యం కాదని వెల్లడి
- ఆయన పేరుతో మెమోరియల్ ఏర్పాటు చేస్తున్నట్టు వివరణ
- అది చిరస్థాయిగా నిలిచిపోతుందని స్పష్టీకరణ
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం .. ఆయన పాట మధురం .. మాట మధురం .. మనసు మధురం. అలాంటి బాలూగారు లేనిలోటు ఎవరూ తీర్చలేనిది. తెలుగు పాటను తేనెతో అభిషేకించినవారాయన. ఆయన తనయుడిగా తనదైన ప్రత్యేకతను చాటుకోవడానికి ఎస్పీ చరణ్ ప్రయత్నం చేస్తున్నాడు. ఒక వైపున గాయకుడిగా బిజీగానే ఉన్న ఆయన, మరో వైపున సినిమాలు చేస్తూనే ఉన్నాడు.
తాజాగా ఎన్టీవీ వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన తండ్రిని గురించి ఆయన ప్రస్తావించారు. "నాన్నగారు ఏ హీరోకు పాడితే .. ఆ హీరోనే పాడుతున్నట్టుగా ఉంటుంది. నాన్నగారు అందుకు సంబంధించిన కసరత్తు చేసేవారు. సినిమా చూస్తున్న ఆడియన్స్ కి హీరో మాట ఒకలా .. పాటపాడుతున్నప్పుడు ఒకలా అనిపించకూడదు. అందువలన ఆ హీరోనే పాడుతున్నట్టుగా అనిపించడానికి నాన్నగారు ప్రయత్నించేవారు. అది మరొకరికి సాధ్యం కాదు కూడా" అని అన్నారు.
"నాన్నగారి పేరుమీద ఒక మెమోరియల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాను. అందుకు సంబంధించిన పనులు ఆల్రెడీ మొదలైపోయాయి. ఈ ఏడాది ఈ ప్రాజెక్టు పూర్తవుతుంది. ఈ విషయంలో ప్రభుత్వ సహాయ సహకారాలు తీసుకోవచ్చును గదా అని చాలామంది అంటున్నారు. కానీ అది నాకు ఇష్టం లేదు. ఇంతవరకూ ఏ గాయకుడికి లేని ఒక మెమోరియల్ ను నేను ఒక కొడుకుగా కాకుండా ఒక అభిమానిలా ఏర్పాటు చేయాలనుకుంటున్నాను. అది చిరస్థాయిగా నిలబడిపోవాలనేది నా ఆకాంక్ష" అని చెప్పారు.