Queen Mary 2: భారీ నౌకలో వైరస్ కలకలం.. 200 మందికి సోకిన నోరో వైరస్

Cruise Ship Illness Norovirus Outbreak Impacts Queen Mary 2
  • సౌతాంప్టన్ నుంచి తూర్పు కరేబియన్ కు బయలుదేరిన ‘క్వీన్ మేరీ 2’ నౌక
  • న్యూయార్క్ చేరుకున్నాక వైరస్ సోకిన విషయం గుర్తింపు
  • బాధితులకు చికిత్స అందించి నౌకను శానిటైజ్ చేసిన అధికారులు
అమెరికాలో పర్యటనకు బయలుదేరిన ఓ భారీ నౌకలో నోరో వైరస్ కలకలం రేగింది. దాదాపు 200 మందికి పైగా ఈ వైరస్ బారిన పడ్డారని తేలింది. సౌతాంప్టన్ నుంచి బయలుదేరిన ‘క్వీన్ మేరీ 2’ నౌకలో ఈ పరిస్థితి తలెత్తింది. మార్గమధ్యలో ఈ నౌక న్యూయార్క్ చేరుకున్న తర్వాత ప్రయాణికులకు నోరో వైరస్ సోకిన విషయాన్ని వైద్య సిబ్బంది గుర్తించారు. దీంతో బాధితులకు చికిత్స అందించడంతో పాటు నౌకను పూర్తిగా శానిటైజ్ చేసినట్లు వెల్లడించారు. నౌకలోని యాత్రికులకు వైరస్ సోకిన విషయాన్ని సెంటర్స్ ఫర్‌ డిసీజ్ కంట్రోల్ అండ్‌ ప్రివెన్షన్ (సీడీసీ) ధ్రువీకరించినట్లు స్థానిక మీడియా కథనాలు ప్రచురించాయి.

ఈ పర్యాటక నౌక మార్చి 8న 2,538 మంది టూరిస్టులు, 1,232 మంది సిబ్బందితో సౌతాంప్టన్‌ నుంచి తూర్పు కరేబియన్‌ దీవులకు బయలుదేరింది. మార్చి 18న న్యూయార్క్ లో ఆగింది. అప్పటికే పలువురు ప్రయాణికులు అస్వస్థతకు గురికావడంతో వైద్యులు వారిని పరీక్షించారు. వైద్య పరీక్షలలో 224 మంది ప్రయాణికులు, 17 మంది సిబ్బంది నోరో వైరస్‌ బారినపడినట్లు నిర్ధారించారు. బాధితులకు చికిత్స అందించి, మిగతా ప్రయాణికులకు వైరస్ సోకకుండా నౌకను శానిటైజ్ చేశామని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ నౌక సౌతాంప్టన్ కు చేరువలో ఉంది, ఏప్రిల్‌ 6న సౌతాంప్టన్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుందని వివరించారు.

కాగా, వామిటింగ్ బగ్ గా పిలిచే నోరో వైరస్ వేగంగా వ్యాప్తి చెందే స్వభావం కలిగి ఉంటుంది. బాధితులు వాడిన పాత్రలు, ఆహారం పంచుకోవడం వల్ల వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది. చిన్నా, పెద్దా తేడా లేకుండా అన్ని వయసుల వారికీ ఇది సోకుతుంది. వైరస్ సోకిన 12 గంటల తర్వాత లక్షణాలు బయటపడతాయి. కొందరిలో ఆలస్యంగా కూడా కనిపించవచ్చు. వైరస్ బాధితులు మూడు రోజుల పాటు వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి, వికారం, జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులతో బాధపడతారు. చాలామంది బాధితులు ఎలాంటి చికిత్స అవసరం లేకుండానే కోలుకుంటారని, ఈ వైరస్ ప్రాణాంతకం కాదని వైద్య నిపుణులు తెలిపారు.
Queen Mary 2
Norovirus Outbreak
Cruise Ship Illness
Southampton
New York
CDC
Vomiting Bug
Travel Illness
Cruise Ship Virus
Norovirus Symptoms

More Telugu News