Malaysia Airlines MH370: పదేళ్ల కిందట ఆచూకీ లేకుండా పోయిన విమానం కోసం మళ్లీ వెదుకులాట

Renewed Search for Missing Malaysia Airlines Flight MH370

  • 2014 మార్చి 8న కౌలాలంపూర్ నుంచి బీజింగ్‌కు బయలుదేరిన బోయింగ్ 777 విమానం అదృశ్యం
  • మూడుసార్లు అన్వేషణ చేపట్టినా విమాన శిథిలాల ఆచూకీ లభించని వైనం
  • నాల్గవసారి గాలింపునకు మలేషియా ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న ఓషన్ ఇన్ఫినిటీ సంస్థ

2014 సంవత్సరంలో మలేషియా ఎయిర్‌లైన్స్ విమానం ఎంహెచ్ 370 అదృశ్యమైన ఘటన అందరికీ తెలిసిందే. 2014 మార్చి 8న కౌలాలంపూర్ నుండి బీజింగ్‌కు 227 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో బయలుదేరిన ఈ విమానం అదృశ్యమైంది. దాదాపు పదేళ్లు గడిచినా ఈ విమానం ఆచూకీ లభించకపోవడంతో ఆధునిక ఏవియేషన్ చరిత్రలో ఇది అతిపెద్ద రహస్యాలలో ఒకటిగా నిలిచిపోయింది.

ఈ విమానం జాడను గుర్తించేందుకు మలేషియా ప్రభుత్వం మళ్లీ చర్యలు చేపట్టింది. విమానం కోసం అన్వేషణను పునఃప్రారంభించేందుకు 70 మిలియన్ డాలర్ల ప్రతిపాదనను ప్రభుత్వం పెట్టగా, ఓషన్ ఇన్ఫినిటీ అనే అమెరికన్ మెరైన్ రోబోటిక్స్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. 18 నెలలలోపు విమానాన్ని గుర్తించేందుకు ఆపరేషన్ చేపడతామని ఆ సంస్థ తెలిపినట్లు సమాచారం.

2014 మార్చి 8న బోయింగ్ 777 విమానం కౌలాలంపూర్ నుంచి బీజింగ్‌కు వెళుతుండగా అదృశ్యమైంది. ఉపగ్రహ డేటా ద్వారా ఈ విమానం దక్షిణ హిందూ మహాసముద్రంలో కూలిపోయిందని గుర్తించారు. ఆ ఆధారంగా విమాన శకలాలను గుర్తించేందుకు మలేషియా ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. కానీ, ఇప్పటివరకు ఒక్క ప్రయత్నం కూడా విజయవంతం కాలేదు.

తొలిసారిగా 200 మిలియన్ డాలర్లతో విమాన గుర్తింపు ప్రతిపాదనను తీసుకువచ్చారు. మలేషియాతో పాటు ఆస్ట్రేలియా, చైనా దేశాల నేతృత్వంలో అన్వేషణ జరిపారు. దాదాపు లక్షా 20 వేల చదరపు కిలోమీటర్ల మేర గాలింపు చర్యలు చేపట్టినా ఎలాంటి శకలాల ఆచూకీ లభించకపోవడంతో 2017 జనవరిలో ఈ ప్రక్రియను నిలిపివేశారు.

ఆ తర్వాత 2018లో రెండోసారి ఓషన్ ఇన్ఫినిటీ సంస్థ లక్షా 12 వేల కిలోమీటర్ల విస్తీర్ణంలో మూడు నెలలపాటు అన్వేషణ చేసింది. కానీ, శిథిలాలు గుర్తించలేకపోయింది. ఇక మూడోసారి చేసిన అన్వేషణలో విమాన రెక్కల శకలాలు సహా 30కి పైగా శిథిలాలు ఆఫ్రికా తీరం మరియు హిందూ మహాసముద్ర దీవుల వెంబడి లభ్యమయ్యాయి. దీని ఆధారంగా ఓషన్ ఇన్ఫినిటీ సంస్థ తాజాగా మరోసారి మలేషియా ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. నాలుగోసారి చేపడుతున్న ఈ అన్వేషణలో విమానానికి సంబంధించిన శిథిలాలు దొరుకుతాయో లేదో వేచి చూడాలి. 

Malaysia Airlines MH370
Missing Plane
Ocean Infinity
Boeing 777
Flight MH370 Search
Indian Ocean
Aviation Mystery
Plane Crash Investigation
Malaysia
Australia
  • Loading...

More Telugu News