KCR: కాంగ్రెస్ పాలన చాలా వింతగా ఉంది: కేసీఆర్

- రజతోత్సవ సభకు జనం ఆతృతతో ఎదురు చూస్తున్నారన్న కేసీఆర్
- బహిరంగ సభకు ప్రజలు స్వచ్ఛందంగా తరలి వస్తారని వ్యాఖ్య
- ఎల్కతుర్తిలో బహిరంగ సభకు భూమి పూజ చేయనున్నట్లు వెల్లడి
కాంగ్రెస్ పాలన విచిత్రంగా ఉందని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర రావు అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పార్టీ నేతలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, బీఆర్ఎస్ రజతోత్సవ సభ కోసం ప్రజలు ఆతృతగా ఎదురు చూస్తున్నారని తెలిపారు. పార్టీ బహిరంగ సభకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తారని చెప్పారు.
రేపు మధ్యాహ్నం ఒంటి గంటకు ఎల్కతుర్తిలో బహిరంగ సభకు భూమి పూజ చేయనున్నట్లు ఆయన తెలిపారు. సభకు వచ్చే జనానికి అనుగుణంగా విస్తృత ఏర్పాట్లు చేయాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. మార్పు కోరుకున్న రైతుల కళ్లల్లో కన్నీళ్లు మిగిలాయని ఆయన అన్నారు. రైతులకు ఈ దుస్థితి వస్తుందని కలలో కూడా ఊహించలేదని అన్నారు. ప్రభుత్వ చర్యలతో రైతులు, వివిధ వర్గాల ప్రజలు మనోధైర్యం కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.