Ratan Tata: రతన్ టాటా వీలునామాలో ఆసక్తికర అంశాలు... ఎవరెవరికి ఎంత...!

Ratan Tatas Will Details of the Billionaires Last Testament
  • గతేడాది కన్నుమూసిన రతన్ టాటా
  • వీలునామాపై సర్వత్రా ఆసక్తి
  • వీలునామాలో వివరాలు ఇవేనంటూ తాజాగా జాతీయ మీడియాలో కథనాలు
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా గతేడాది అక్టోబరు 9న కన్నుమూశారు. ఆయన తన వీలునామాలో ఏం రాశారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తాజాగా, రతన్ టాటా వీలునామాలోని వివరాలు ఇవేనంటూ జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. ఆయా కథనాల ప్రకారం... తన ఆస్తుల్లో సింహభాగం సేవా కార్యక్రమాలకే వెచ్చించాలని ఆయన నిర్ణయించారు. ఆ మేరకు దాదాపు రూ.3,800 కోట్లను తన పేరుతో ఉన్న ఎండోమెంట్ ఫౌండేషన్, ట్రస్టులకు కేటాయించారు. టాటా సన్స్ లో ఆయనకున్న వాటాలతో పాటు ఇతర ఆస్తులు కూడా ఇందులో ఉన్నాయి. ఒకవేళ ఈ షేర్లను అమ్మాల్సి వస్తే, ప్రస్తుతం ఉన్న వాటాదారులకే అమ్మాలని వీలునామాలో పేర్కొన్నారు.

అలాగే, తన సవతి సోదరీమణులు శిరీన్ జజీభోయ్, దియానా జజీభోయ్ లకు రూ.800 కోట్లు విలువ చేసే ఫిక్స్‌డ్ డిపాజిట్లు, స్టాక్స్‌తో పాటు ఖరీదైన వాచ్‌లు, పెయింటింగ్స్ వంటి విలువైన వస్తువులను కూడా ఇచ్చారు. టాటా గ్రూప్ మాజీ ఉద్యోగి, రతన్ కు అత్యంత సన్నిహితుడైన మోహిన్ ఎం. దత్తాకు కూడా రూ.800 కోట్ల విలువైన ఆస్తులు రాశారు.

ఇక తన సోదరుడు జిమ్మీ నావల్ టాటాకు జుహులోని బంగ్లాలో వాటా, కొన్ని వెండి వస్తువులు, బంగారు ఆభరణాలను కేటాయించారు. అలీబాగ్ లోని బంగ్లా, మూడు పిస్టోళ్లను తన ప్రియ మిత్రుడు మెహిల్ మిస్త్రీ పేరు మీద రాసినట్లు తెలుస్తోంది.

వీధి కుక్కల సంరక్షణ కోసం ఆసుపత్రులను నిర్మించిన రతన్ టాటా, వాటి సంరక్షణ కోసం రూ.12 లక్షల ఫండ్ ను ఏర్పాటు చేశారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి రూ.30 వేల చొప్పున వాటి సంరక్షణ కోసం ఖర్చు చేసేలా నిధులను కేటాయించారు.

తన జీవిత చరమాంకంలో తనకు సహాయంగా ఉన్న శంతను నాయుడుకు ఇచ్చిన విద్యా రుణాన్ని మాఫీ చేశారు. తన పొరుగింట్లో ఉండే జేక్ మాలిటే అనే వ్యక్తికి ఇచ్చిన రూ.23 లక్షల అప్పును కూడా రద్దు చేశారు.

విదేశాల్లో రతన్ టాటాకు రూ.40 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. సీషెల్స్ లో భూములు, మోర్గాన్ స్టాన్లీ, వెల్స్ ఫార్గో వంటి ఆర్థిక సంస్థల్లో బ్యాంకు ఖాతాలు, ఆల్కోవా కార్పొరేషన్, హౌమెట్ ఏరోస్పేస్ వంటి కంపెనీల్లో షేర్లు ఉన్నాయి. ఆయన వద్ద ప్రముఖ బ్రాండ్లకు చెందిన 65 ఖరీదైన చేతి గడియారాలు కూడా ఉన్నాయి.

ఈ వీలునామాను 2022 ఫిబ్రవరి 23న రాసినట్లు సమాచారం. దీనిని పరిశీలించి ఆస్తుల కేటాయింపులు చేయాలని ఇప్పటికే బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆ ప్రక్రియ పూర్తయ్యే సరికి మరో ఆరు నెలలు పట్టే అవకాశం ఉంది.

Ratan Tata
Will
Testament
Tata Sons
Inheritance
Shirin Jaipuriyar
Diana Jaipuriyar
Mohin M. Dalal
Jimmy Naval Tata
Mehli Mistri

More Telugu News