Harish Rao: సీఎం రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటితే... అడుగు గడప దాటడం లేదు: హ‌రీశ్ రావు

Harish Rao Slams Revanth Reddy Over Unfulfilled Promises

  • 'ఎక్స్' వేదిక‌గా రుణమాఫీ, రైతు భరోసాల‌పై సీఎంను నిల‌దీసిన బీఆర్ఎస్ నేత‌
  • మాటిచ్చి మోసం చేయడం సీఎంకు అలవాటుగా మారింద‌ని విమ‌ర్శ‌
  • సీఎం రేవంత్ రెడ్డి మాటలు ఘనంగా ఉంటే, చేతలు హీనంగా ఉన్నాయ‌న్న హ‌రీశ్ రావు
  • డేట్లు, డెడ్ లైన్లు మారుతున్నాయి తప్పితే రైతులకు ఇచ్చిన హామీలు మాత్రం నెరవేరడం లేద‌ని ఫైర్‌

సీఎం రేవంత్ రెడ్డిపై సోష‌ల్ మీడియా వేదిక‌గా బీఆర్ఎస్ నేత‌, మాజీ మంత్రి హ‌రీశ్ రావు తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. ఇచ్చిన వాగ్దానాలను తుంగలో తొక్కడం, మాటిచ్చి మోసం చేయడం, నాలుక మడతేయడం రేవంత్ రెడ్డికి అలవాటుగా మారింద‌ని దుయ్య‌బ‌ట్టారు. ఈ మేర‌కు 'ఎక్స్' (ట్విట్ట‌ర్) వేదిక‌గా రుణమాఫీ, రైతు భరోసాల‌పై సీఎంను నిల‌దీస్తూ హ‌రీశ్ రావు పోస్టు చేశారు.

"మార్చి 31 కల్లా రైతు భరోసా డబ్బులు రైతులందరి ఖాతాల్లో వేస్తామని జనవరి 26న గొప్పగా ప్రకటించారు. మొన్నటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనూ అదే ముచ్చ‌ట‌ చెప్పారు. రేవంత్ రెడ్డి మాటలు ఘనంగా ఉంటే, చేతలు హీనంగా ఉన్నాయి. మాటలు కోటలు దాటితే అడుగు గడప దాటడం లేదు. 

ముఖ్యమంత్రి మాటలు నమ్మి ఉగాది వేళ ఆశగా ఎదురుచూసిన రైతులకు చేదు అనుభవమే ఎదురైంది. రైతులను ఇంకెన్ని సార్లు మోసం చేస్తావు రేవంత్ రెడ్డి..? దసరాకిస్తమన్నరు, ఇవ్వలేదు. సంక్రాంతికి ఇస్తమన్నరు, ఇవ్వలేదు... ఉగాదికి ఇస్తామని ఊరించారు. రైతుల్ని ఉసూరుమనిపించారు.

కొత్త సంవత్సరం రైతులకు చేదు అనుభవాన్ని మిగుల్చింది ఈ రైతు వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వం. కేసీఆర్ గారు నాట్ల సమయంలో రైతు బంధు ఇస్తే, రేవంత్ రెడ్డి కోతల సమయం వచ్చినా రైతు భరోసా ఇవ్వడం లేదు. మోసమే తన విధానంగా మార్చుకున్న రేవంత్ రెడ్డి రైతుల్ని అన్ని కోణాల్లో దగా చేస్తున్నడు. రుణమాఫీని దారుణ వంచనగా మార్చిండు. 

ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అడుగు ముందుకు పడటం లేదు. డేట్లు మారుతున్నాయి, డెడ్ లైన్లు మారుతున్నాయి తప్ప, రైతులకు ఇచ్చిన హామీలు మాత్రం నెరవేరడం లేదు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లు, అసెంబ్లీలో ప్రకటించినట్లు రైతులందరికీ రుణమాఫీ చేసేదాకా, రైతు భరోసా ఇచ్చే దాకా బీఆర్ఎస్ పార్టీ నిన్నూ, నీ కాంగ్రెస్ పార్టీని వెంటాడుతూనే ఉంటుంది. ఎక్కడిక్కడ నిలదీస్తూ, మీ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగడుతూనే ఉంటుంది" అని హ‌రీశ్ రావు ట్వీట్ చేశారు. 

Harish Rao
Revanth Reddy
Andhra Pradesh Politics
Telangana Politics
Farmer Loan Waiver
Rythu Bharosa
Congress Party
BRS Party
Indian Politics
Election Promises
  • Loading...

More Telugu News