MK Stalin: తమిళనాడు సీఎం స్టాలిన్ పై కన్నడ ప్రజల ఆగ్రహం... కారణం ఇదే!

MK Stalin Faces Kannada Peoples Anger Over Ugadi Greetings

  • ఉగాది పర్వదినం సందర్భంగా తెలుగు, కన్నడ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ స్టాలిన్ పోస్టు
  • ద్రావిడులుగా సంభోధించడంపై కన్నడ ప్రజల ఆగ్రహం
  • తాము ద్రావిడులం కాదని వెల్లడి

ఉగాది పర్వదినం సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తెలుగు, కన్నడ ప్రజలను ఉద్దేశిస్తూ చేసిన ట్వీట్ వివాదాస్పదమైంది. తెలుగు, కన్నడ భాషల్లో స్టాలిన్ ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ కన్నడిగులను ద్రవిడులుగా పేర్కొనడంతో దుమారం రేగింది. స్టాలిన్ పోస్టుపై పలువురు కన్నడవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

"నూతన సంవత్సరానికి కొత్త ఆశలతో స్వాగతం పలుకుతున్న తెలుగు, కన్నడ మాట్లాడే ద్రవిడ సోదరులు, సోదరీమణులకు ఉగాది శుభాకాంక్షలు" అని స్టాలిన్ పేర్కొన్నారు. హిందీ భాషను బలవంతంగా రుద్దడం, డీలిమిటేషన్ వంటి భాషా, రాజకీయపరమైన ముప్పుల నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాలన్నీ ఐక్యంగా ఉండటం అత్యవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. మన హక్కులను, గుర్తింపును అణచివేసే ప్రతి ప్రయత్నాన్ని మనమంతా కలిసి ఓడించాలని పిలుపునిచ్చారు. ఈ ఉగాది మన ఐక్యతకు స్ఫూర్తిగా నిలవాలని స్టాలిన్ ఆకాంక్షించారు.

అయితే, స్టాలిన్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. కన్నడ ప్రజలను ద్రవిడులుగా సంబోధించడంపై కొందరు కన్నడిగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డీలిమిటేషన్, బలవంతపు హిందీ భాష అమలుపై కలిసి పోరాడేందుకు కన్నడిగులు ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటారని, అయితే తాము ద్రవిడులం కాదని గుర్తుంచుకోవాలని, కన్నడ ద్రావిడ భాష కాదని పలువురు కన్నడ పౌరులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. 

MK Stalin
Tamil Nadu CM
Kannada people
Ugadi greetings
controversy
Dravidian
social media
Hindi imposition
language politics
South India unity

More Telugu News