Gujarat Traffic Police: గుజరాత్‌లో ఏసీ హెల్మెట్లు ధరించి విధులు నిర్వర్తిస్తున్న ట్రాఫిక్ పోలీసులు

- రాష్ట్రంలోని వడోదర నగరంలో ఏసీ హెల్మెంట్లు ధరించిన పోలీసులు
- ఎండ వేడి తాపం నుంచి రక్షించుకోవడానికి వడోదర ట్రాఫిక్ విభాగం వినూత్న ఆలోచన
- 500 మంది ట్రాఫిక్ పోలీసులకు ఏసీ హెల్మెట్లు అందజేత
వేసవి కాలంలో వేడి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు గుజరాత్‌లోని ట్రాఫిక్ విభాగం వినూత్న ఆలోచన చేసింది. సూర్యుడి తాపం నుంచి రక్షణ పొందేందుకు వడోదరలోని ట్రాఫిక్ పోలీసులు ఏసీ హెల్మెట్లు వినియోగిస్తున్నారు. ఎండాకాలం కాసేపు బయటకు వెళితేనే వేడికి అల్లాడిపోతాం. ఎక్కువసేపు ఎండలో ఉండాలంటే భయపడిపోతాం.
అలాంటిది ట్రాఫిక్ సిబ్బంది గంటలకొద్ది ఎండ వేడిని తట్టుకుంటూ తమ విధులను నిర్వర్తించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో వడోదర ట్రాఫిక్ విభాగం వినూత్నంగా ఆలోచించి ట్రాఫిక్ పోలీసులకు ఏసీ హెల్మెట్లను అందించింది. నగరంలోని 500 మందికి పైగా ట్రాఫిక్ పోలీసులకు ఏసీ హెల్మెట్లు అందజేశారు. దీంతో ట్రాఫిక్ పోలీసులు మండుటెండల్లోనూ ప్రశాంతంగా విధులు నిర్వహిస్తున్నారు.