Maoist Party: తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై మావోయిస్టు పార్టీ సంచలన లేఖ

Maoists Criticize Telangana Govt

  • ఓయూలో నిర్భంధ ఆంక్షలను విధించారంటూ మావోయిస్టు పార్టీ ఆగ్రహం
  • మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరిట లేఖ విడుదల
  • ప్రశ్నించేవారి గొంతు నొక్కుతున్నారని మండిపాటు
  • విద్యార్థుల పోరాటాలపై ఉక్కుపాదం మోపుతోందని ఆగ్రహం
  • నిర్బంధ ఆంక్షలను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్

కాంగ్రెస్ ప్రభుత్వంపై మావోయిస్టు పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉస్మానియా యూనివర్శిటీలో నిర్భంద ఆంక్షలను విధించడాన్ని విమర్శిస్తూ సంచలన లేఖను విడుదల చేసింది. మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరిట ఈ లేఖ విడుదలయింది. నేటి పాలకుల కారణంగా ఎన్నడూ లేని విధంగా ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని తెలిపింది.  

ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించే వారి గొంతు నొక్కుతున్నారని మండిపడింది. నియంతృత్వ విధానాలను అమలు చేస్తూ పౌరుల స్వేచ్ఛను, ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నారని విమర్శించింది. 

ఓయూలో ధర్నాలు, ఆందోళనలు, నిరసనలు చేయకూడని ఈ నెల 13న యూనివర్శిటీ రిజిస్ట్రార్ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని ఆ లేఖలో తెలిపింది. ఈ ఉత్తర్వులకు విరుద్ధంగా వ్యవహరించిన వారిని శిక్షిస్తామని హెచ్చరించిందని... విద్యార్థుల పోరాటాలపై ఉక్కుపాదం మోపుతోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. 

కాంగ్రెస్ ప్రభుత్వ చర్యలు దేశాన్ని నాశనం చేసేలా ఉన్నాయని మావోయిస్టు పార్టీ వ్యాఖ్యానించింది. నిజాం మొదలు నేటి ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలను వ్యతిరేకిస్తూ ఓయూ విద్యార్థులు ఇప్పటికీ పోరాడుతున్నారని... తెలంగాణ సామాజిక, ఆర్థిక, రాజకీయ పోరాటాలలో క్రియాశీలంగా పాల్గొన్నారని తెలిపింది. 

నేటి దోపిడీ పాలక వర్గాలు నిరంకుశ బూర్జువా వర్గాల ప్రయోజనాలను రక్షించడమే తమ ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నాయని మండిపడింది. ఓయూలో విధించిన నిర్బంధ ఆంక్షలను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేసింది. ఈ ఆంక్షలను ఎత్తివేసేంత వరకు విద్యార్థులంతా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చింది.

Maoist Party
Telangana Congress Government
Osmania University
Student Protests
Restrictions on Protests
Political Repression
Democratic Rights
Anti-Government Protest
Telangana Politics
India Politics
  • Loading...

More Telugu News