Narendra Modi: మోదీ పదవీ విరమణ చేయాలని ఆలోచిస్తున్నట్లుగా ఉంది: సంజయ్ రౌత్

- మోదీ పదేళ్లలో ఎప్పుడూ ఆరెస్సెస్ కార్యాలయానికి వెళ్లలేదన్న సంజయ్ రౌత్
- పదవీ విరమణ చేయాలనే ఆలోచనతోనే వెళ్లి ఉంటారని వ్యాఖ్య
- మోదీ నాయకత్వంలో ఇంకా చాలాకాలం పని చేస్తామన్న ఫడ్నవీస్
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పదవీ విరమణ చేయాలని ఆలోచనలో ఉన్నారేమోనని, అందుకే ఆయన ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి వెళ్లి ఉండవచ్చని శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ అన్నారు. మోదీ నాగ్‌పూర్‌లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించడంపై సంజయ్ రౌత్ స్పందిస్తూ, గత పదేళ్లలో ఆయన ఎప్పుడూ ఆ కార్యాలయానికి వెళ్లలేదని, ఇప్పుడు వెళ్లడానికి ముఖ్య కారణం ఏదైనా ఉండి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు.
తన పదవీ విరమణ ప్రణాళికల గురించి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌తో చర్చలు జరపడానికి ఆయన అక్కడకి వెళ్లి ఉంటారని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఆర్ఎస్ఎస్ దేశ నాయకత్వంలో మార్పును కోరుకుంటున్నట్లు తాను భావిస్తున్నానని, వారు తదుపరి బీజేపీ చీఫ్‌ను ఎన్నుకోవాలనుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ నియమాల ప్రకారం మోదీ కూడా రాజకీయాల నుంచి విరమించాలని కోరుకుంటున్నట్లుగా ఉందని ఆయన అన్నారు.
అందుకే ప్రధాని మోదీ మోహన్ భగవత్‌ను కలిసి పదవీ విరమణ పత్రాన్ని సమర్పించి ఉంటారని ఆయన పేర్కొన్నారు. మోదీ రాజకీయ వారసుడు మహారాష్ట్ర నుంచే వస్తాడని తాను బలంగా విశ్వసిస్తున్నానని సంజయ్ రౌత్ అన్నారు.
సంజయ్ రౌత్ వ్యాఖ్యలపై స్పందించిన ఫడ్నవీస్
సంజయ్ రౌత్ వ్యాఖ్యలపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. మోదీ నాయకత్వంలో తాము ఇంకా చాలా ఏళ్లు పని చేస్తామని అన్నారు. 2029లోనూ ఆయన ప్రధానిగా సేవలు అందిస్తారని ధీమా వ్యక్తం చేశారు. సమర్థవంతమైన నాయకుడు తమను నడిపిస్తున్నప్పుడు వారసుడి కోసం వెతకాల్సిన అవసరం లేదని అన్నారు. నరేంద్ర మోదీ 11 ఏళ్ల క్రితం ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన తొలిసారిగా ఆదివారం నాడు ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు.