Sunrisers Hyderabad: సన్ రైజర్స్ హైదరాబాద్ ఆరోపణలపై హెచ్సీఏ స్పందన

- ఉచిత టికెట్ల కోసం హెచ్సీఏ వేధిస్తోందన్న సన్ రైజర్స్ హైదరాబాద్
- వేధింపులు కొనసాగితే హైదరాబాద్ ను వదిలి వెళ్లేందుకు సిద్ధమని సన్ రైజర్స్ చెప్పినట్టు వార్తలు
- ఆ వార్తల్లో నిజంలేదన్న హెచ్సీఏ
ఉచిత టికెట్ల కోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) వేధిస్తోందని ఆరోపించినట్టు... ఈ వేధింపులు ఇలాగే కొనసాగితే హైదరాబాద్ విడిచి వెళ్లడానికి తమ ఫ్రాంఛైజీ సిద్ధంగా ఉందని సన్ రైజర్స్ హైదరాబాద్ స్పష్టం చేసినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వార్తలపై హెచ్సీఏ స్పందించింది. ఆ వార్తల్లో నిజం లేదని పేర్కొంటూ ఒక ప్రకటనను విడుదల చేసింది. తమకు సన్ రైజర్స్ హైదరాబాద్ ఎలాంటి ఈమెయిల్స్ రాయలేదని తెలిపింది.
ఒకవేళ నిజంగానే ఈమెయిల్స్ వచ్చి ఉంటే... ఈ సమాచారాన్ని హెచ్సీఏ లేదా సన్ రైజర్స్ అధికారిక ఈమెయిల్స్ నుంచి కాకుండా గుర్తు తెలియని ఈమెయిల్స్ నుంచి లీక్ చేయడం ఏమిటని ప్రశ్నించింది. ఈ ఈమెయిల్స్ నిజమైనవా? కాదా? అనే విషయం తెలుసుకోవడానికి తమ నుంచి కూడా మీడియా వివరణ తీసుకోవాలని సూచించింది. తప్పుడు వార్తలు ప్రచారం చేయవద్దని కోరింది.