Shivaji: శివాజీపై ప్రశంసలు కురిపించిన చిరంజీవి

- 'కోర్ట్' సినిమాలో మంగపతి పాత్రను పోషించిన శివాజీ
- మంగపతి పాత్రలో ఒదిగిపోయిన శివాజీ
- శివాజీని ఇంటికి పిలిపించుకుని అభినందించిన చిరంజీవి
నేచురల్ స్టార్ నాని నిర్మాతగా వచ్చిన 'కోర్ట్' సినిమా మంచి విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో శివాజీ పోషించిన మంగపతి పాత్ర ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. ఈ నేపథ్యంలో శివాజీని మెగాస్టార్ చిరంజీవి తన నివాసానికి పిలిపించుకుని అభినందించారు. ఇలాంటి పాత్రలతో నీ ప్రతిభను మరింతగా చాటాలని శివాజీని చిరంజీవి అభినందించినట్టు సమాచారం. గతంలో 'ఇంద్ర' సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య మంచి అనుబంధం కొనసాగుతోంది. ఈ సందర్భంగా వీరు కలిసి దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
చిరంజీవిని కలవడంపై శివాజీ సోషల్ మీడియాలో స్పందిస్తూ... ఈ క్షణాలు తన మనసులో ఎప్పటికీ నిలిచిపోతాయని చెప్పారు. చిరంజీవి గారు 'కోర్ట్' సినిమాను చూశారని... సినిమా అద్భుతంగా ఉందని ప్రశంసించారని తెలిపారు. ఈ సంతోషాన్ని మాటల్లో చెప్పలేనని అన్నారు.
ఈ సినిమాలోని మంగపతి పాత్ర నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్ర. తన కుటుంబ సభ్యురాలిని కాపాడే క్రమంలో చందు అనే కుర్రాడిని ఇబ్బంది పెట్టే పాత్రలో శివాజీ అద్భుతంగా నటించారు. ఈ సినిమా విజయంలో మంగపతి క్యారెక్టర్ కీలక పాత్రను పోషించింది.