Mohanlal: ఎల్2 ఎంపురాన్‌లో వివాదాస్పద సీన్లు... క్షమాపణలు చెప్పిన మోహన్‌లాల్..

Mohanlal Apologizes for Controversial Scenes in L2 Empuraan
  • సినిమాలో 2002 గుజరాత్ అల్లర్లకు సంబంధించిన సీన్లపై విమర్శలు
  • ఓ వర్గాన్ని తక్కువ చేసి చూపించేలా సన్నివేశాలున్నాయని ఆరోపణలు
  • వాటిని తొలగించాలని డిమాండ్
  • తొలగిస్తామన్న మోహన్‌లాల్
  • సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు
మలయాళ నటుడు మోహన్‌లాల్ క్షమాపణలు తెలిపారు. ఆయన హీరోగా నటించిన తాజా సినిమా ‘ఎల్2 ఎంపురాన్’లో కొన్ని వివాదాస్పద సన్నివేశాలపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఆయన విచారం వ్యక్తం చేశారు. 2002లో గుజరాత్‌ అల్లర్లకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను ఇందులో చూపించారు. అల్లర్ల సమయంలో ఓ కుటుంబాన్ని మరో వర్గానికి చెందిన నాయకుడు దారుణంగా హత్య చేయడం, కొంతకాలానికి అతడే రాజకీయాల్లో అడుగుపెట్టడం వంటి అంశాలు ఇందులో ఉన్నాయి. ఈ సన్నివేశాలను చాలామంది తప్పుబట్టారు. ఒక వర్గాన్ని తక్కువ చేసి చూపించేలా ఈ సన్నివేశాలు ఉన్నాయని ఆరోపిస్తున్నారు. సినిమాను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.

ఈ నేపథ్యంలో తాజాగా స్పందించిన మోహన్‌లాల్ సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు తెలిపారు. రాజకీయ, సామాజిక అంశాలు కొన్ని ఎంపురాన్ సినిమాలో భాగమయ్యాయని, తనకు ప్రియమైన కొందరిని అవి బాధించాయని పేర్కొన్నారు. ఏ రాజకీయ ఉద్యమాన్ని, భావజాలాన్ని, మతాన్ని తన సినిమాలు కించపరచకుండా చూడటం నటుడిగా తన బాధ్యత అని పేర్కొన్నారు. కాబట్టి తన తరుపున, తన చిత్రబృందం తరపున క్షమాపణలు చెబుతున్నట్టు తెలిపారు. ఆ సన్నివేశాలను తొలగించాలని నిర్ణయించినట్టు వివరించారు. గత నాలుగు దశాబ్దాలుగా మీలో ఒకడిగా ఉంటున్నానని, మీ ప్రేమ, నమ్మకమే తన బలమని అభిమానుల్ని ఉద్దేశించి మోహన్‌లాల్ పోస్టు చేశారు. కాగా, ఈ సినిమాను తాజాగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుటుంబంతో కలిసి వీక్షించారు.
Mohanlal
L2 Empuraan
controversial scenes
Gujarat riots
apology
Malayalam cinema
Kerala
Pinarayi Vijayan
social media
movie controversy

More Telugu News