KCR: కేసీఆర్ ఉగాది శుభాకాంక్షలు

- సాంస్కృతిక జీవనంలో ఉగాదికి ప్రత్యేక స్థానముందన్న కేసీఆర్
- సబ్బండ వర్గాలకు ఉగాది గొప్ప పర్వదినమని వ్యాఖ్య
- ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలని ప్రకృతిమాతను ప్రార్థిస్తున్నానన్న కేసీఆర్
ఉగాది పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు ప్రజల సాంస్కృతిక జీవనంలో ఆది పండుగైన ఉగాదికి ప్రత్యేక స్థానం ఉందని కేసీఆర్ తెలిపారు. రైతన్నలు ఈ పండుగ రోజున వ్యవసాయ పనులను ప్రారంభిస్తారని... వ్యవసాయనామ సంవత్సరంగా ఉగాది నిలుస్తుందని చెప్పారు. ప్రకృతితో మమేకమై సాగు, ఉత్పత్తి సంబంధాల్లో పరస్పర సహకారం ప్రేమాభిమానాలతో పాలుపంచుకునే సబ్బండ వర్గాలకు ఉగాది గొప్ప పర్వదినమని అన్నారు.
ఈ పండుగ వేళ చెట్లు పచ్చగా చిగురిస్తూ నూతనోత్సాహాన్ని సంతరించుకునే ప్రకృతిమాత... ప్రజల జీవితాల్లో అదే నూతనోత్సాహాన్ని నింపాలని అభిలషించారు. ఉగాది పచ్చడి మాదిరిగా జీవితంలో షడ్రుచులను ఆస్వాదిస్తూ ప్రతి సందర్భాన్ని ఎదుర్కోవడం ద్వారానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతన్నలు, సబ్బండ జనుల సంక్షేమం దిశగా కార్యాచరణ చేపట్టి ప్రజల జీవితాల్లో మరింత మార్పును తీసుకురావాలని ఆకాంక్షించారు. తాగు, సాగునీరు పుష్కలంగా లభించాలని, పంటలు సమృద్ధిగా పండి ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు వెల్లివిరిసేలా దీవించాలని ప్రకృతిమాతను ప్రార్థిస్తున్నానని చెప్పారు.