Silver Prices: బంగారంతో పోటీపడుతున్న వెండి

- రోజురోజుకు పెరుగుతున్న బంగారం, వెండి ధరలు
- పది గ్రాముల బంగారం ధర రూ.92,150లు
- వెండి కిలో రూ.1.03 లక్షలు
- వెండి కిలో రూ.1,25వేల వరకూ పెరిగే అవకాశం ఉందంటున్న నిపుణులు
బంగారం ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. అంతర్జాతీయంగా ఉన్న డిమాండ్ కారణంగా దేశీయంగా రికార్డు స్థాయి గరిష్ఠాలను నమోదు చేస్తున్నాయి. ప్రస్తుతం పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.92,150 లకు చేరుకుంది. అయితే, బంగారం ధర రూ.99 వేల వరకు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇదే సమయంలో వెండి ధరలు కూడా రికార్డు స్థాయిలో పెరిగి ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. కిలో వెండి ధర రూ.1.03 లక్షలకు చేరుకుంది. గత ఏడాదిలో బంగారం, వెండి ధరలు 37 శాతం మేర పెరగగా, గత నెలలో బంగారం 6.70 శాతం, వెండి 8.80 శాతం మేర పెరగడం గమనార్హం.
2024-25 ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో బంగారం 31.37 శాతం రాబడిని ఇవ్వగా, వెండి మాత్రం దానిని కూడా అధిగమించి 35.56 శాతం రాబడిని అందించింది. బంగారం, వెండి పెట్టుబడిదారులకు అధిక లాభాలను అందిస్తుండటం విశేషం.
ఈ నేపథ్యంలో పెట్టుబడిదారులు వెండిపై పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. బంగారం కంటే వెండి ఎక్కువ లాభదాయకంగా ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరికొన్ని రోజుల్లో వెండి ధరలు రూ.1.25 లక్షలు దాటే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.