Nara Bhuvaneswari: ఎన్టీఆర్ ట్రస్ట్ 'న్యూట్రిఫుల్ యాప్' కు స్కోచ్ అవార్డు... నారా భువనేశ్వరిని అభినందించిన చంద్రబాబు, లోకేశ్

- డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్ విభాగంలో న్యూట్రిఫుల్ యాప్ కు ఫస్ట్ ప్రైజ్
- హర్షం వ్యక్తం చేసిన చంద్రబాబు, నారా లోకేశ్
- నారా భువనేశ్వరిపై ప్రశంసలు
ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ కు చెందిన న్యూట్రిఫుల్ యాప్, ఈ సంవత్సరం జరిగిన స్కోచ్ అవార్డులలో డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ విభాగంలో మొదటి బహుమతిని గెలుచుకుంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరిని ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ అభినందించారు.
నారా భువనేశ్వరి మరియు న్యూట్రిఫుల్ బృందానికి అభినందనలు అంటూ చంద్రబాబు సోషల్ మీడియాలో స్పందించారు. అందరికీ ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించడంలో వారు చేస్తున్న కృషి అభినందనీయమని, వారికి మరిన్ని విజయాలు కలగాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు.
ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలోని ఈ యాప్‌కు 4 లక్షలకు పైగా ఎన్‌రోల్‌మెంట్‌లు ఉన్నాయని. ఆరోగ్య సంరక్షణ ముఖ్య ఉద్దేశంగా ఇది పనిచేస్తూ, 4 లక్షలకు పైగా ఉచిత సంప్రదింపులు మరియు ఆహార ప్రణాళికలను అందిస్తోందని చంద్రబాబు వివరించారు.
అత్యాధునిక ఫుడ్ స్కానర్‌తో సహా తాజా ఏఐ సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేస్తున్న ఈ యాప్‌కు శిక్షణ పొందిన న్యూట్రిషనిస్టుల బృందం మద్దతు ఇస్తోందని వెల్లడించారు. న్యూట్రిఫుల్ యాప్ ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడంలో విశేషమైన ముందడుగు వేస్తోందని వివరించారు.
కంగ్రాచ్యులేషన్స్ అమ్మా!: నారా లోకేశ్
న్యూట్రిఫుల్ యాప్ కు స్కోచ్ అవార్డు లభించిన నేపథ్యంలో కంగ్రాచ్యులేషన్స్ అమ్మా అంటూ లోకేశ్ తన తల్లి నారా భువనేశ్వరి అభినందనలు తెలిపారు. తన తల్లి నారా భువనేశ్వరి, ఎన్టీఆర్ ట్రస్ట్ ఘనతల పట్ల గర్విస్తున్నానని పేర్కొన్నారు. సామాజిక సేవలో, ఆరోగ్యకరమైన భవిష్యత్తును నిర్మించడంలో ఆమెకున్న అచంచలమైన అంకితభావం తనకు ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తుందని తెలిపారు. స్కోచ్ అవార్డు లభించడం ఆమె దార్శనికతకు, కృషికి తగిన గుర్తింపు అని లోకేశ్ స్పష్టం చేశారు.