Revanth Reddy: ప్రజా ప్రయోజనాల విషయంలో ఖర్చుకు వెనుకాడవద్దు: రేవంత్ రెడ్డి

- నగర ప్రజల అవసరాలకు అనుగుణంగా లింక్ రోడ్లను నిర్మించాలన్న సీఎం
- అనుసంధానం, ఆటంకాలు లేని రాకపోకలకు వీలుగా రోడ్లు నిర్మించాలన్న ముఖ్యమంత్రి
- అదనపు భూసేకరణ విషయంలో ఖర్చుకు వెనుకాడవద్దన్న ముఖ్యమంత్రి
ప్రజా ప్రయోజనాల విషయంలో వ్యయానికి వెనుకాడవద్దని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చేపడుతున్న అనుసంధాన రహదారుల నిర్మాణం, విస్తరణపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నగర ప్రజల అవసరాలకు అనుగుణంగా లింక్ రోడ్లను నిర్మించాలని సూచించారు.
హైదరాబాద్ మున్సిపల్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) పరిధిలోని 49 రోడ్ల నిర్మాణం, విస్తరణపై ఆయన పలు సూచనలు చేశారు. వివిధ ప్రాంతాల అనుసంధానం, ఆటంకాలు లేని రాకపోకలకు వీలుగా రహదారులు నిర్మించాలని అధికారులను ఆదేశించారు. అదనపు భూసేకరణ విషయంలో వ్యయానికి వెనుకాడవద్దని, ప్రజాప్రయోజనాలనే దృష్టిలో ఉంచుకోవాలని అన్నారు.