Ali: బిర్యానీ ఇచ్చి మోసం చేసినవాడిగా చరిత్రలో నిలిచిపోతారు: అలీపై యూట్యూబర్ అన్వేష్ సంచలన వ్యాఖ్యలు

- బెట్టింగ్ యాప్‌లపై యూట్యూబర్ అన్వేష్ పోరాటం
- కమెడియన్ అలీపై సంచలన ఆరోపణలు
- పాపపు సొమ్మును పంచేయాలని అలీకి సూచన
ప్రముఖ హాస్యనటుడు అలీ బెట్టింగ్ యాప్‌లను ప్రోత్సహిస్తున్నారంటూ యూట్యూబర్ అన్వేష్ సంచలన ఆరోపణలు చేశారు. 'నా అన్వేషణ' పేరుతో యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్న అన్వేష్, బెట్టింగ్ యాప్‌ల గురించి ప్రజల్లో అవగాహన కల్పిస్తూ సెలబ్రిటీలను ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా కమెడియన్ అలీపై ఆయన ఒక వీడియో విడుదల చేశారు.
బాల నటుడిగా తన సినీ జీవితాన్ని ప్రారంభించి, దాదాపు వెయ్యి సినిమాల్లో నటించిన అలీ, 50 చిత్రాల్లో హీరోగా కూడా నటించారు. సుమారు రూ. 1000 కోట్ల ఆస్తులు ఉన్నప్పటికీ, బెట్టింగ్ యాప్‌లను ప్రోత్సహించాల్సిన అవసరం ఏముందని అన్వేష్ ప్రశ్నించారు. అలీ తన భార్యతో కలిసి బిర్యానీ వీడియో ద్వారా కోట్ల రూపాయల మోసానికి పాల్పడ్డారని ఆరోపించారు. బిర్యానీ పంచి ప్రజలను మోసం చేసిన వ్యక్తిగా అలీ చరిత్రలో మిగిలిపోతారని అన్వేష్ తన వీడియోలో పేర్కొన్నారు. ఆ వీడియోలో తయారు చేసిన బిర్యానీకి ఓ రూ.10 వేలు ఖర్చయి ఉంటుందేమోనని, కానీ ఆ వీడియో ద్వారా బెట్టింగ్ వీడియోను ప్రమోట్ చేశారని అన్వేష్ వివరించారు.
బెట్టింగ్ యాప్‌లను ప్రోత్సహించవద్దని తాను అలీకి సూచించినప్పుడు, 'అల్లా ఎక్కడైనా చెప్పారా?' అని ఆయన ప్రశ్నించారని అన్వేష్ తెలిపారు. బెట్టింగ్ యాప్‌ల ద్వారా లక్షల్లో సంపాదిస్తున్నప్పటికీ, వాటి వల్ల ఎంతోమంది నష్టపోతున్నారని, కొందరు ప్రాణాలు కూడా కోల్పోతున్నారని అన్వేష్ ఆవేదన వ్యక్తం చేశారు.
అలీ బెట్టింగ్ యాప్‌లను ప్రోత్సహించిన వీడియోలను తొలగించినప్పటికీ, ప్రజలు ఇంకా వాటిని గుర్తుంచుకున్నారని అన్నారు. బెట్టింగ్ యాప్‌ల ద్వారా సంపాదించిన డబ్బుతో నష్టపోయిన వారికి సహాయం చేసి, ఆ పాపాన్ని కడుక్కోవాలని అన్వేష్ సూచించారు.