Tattoo: టాటూలతో క్యాన్సర్ ముప్పు.. సైజు పెరిగిన కొద్దీ ముప్పు కూడా పెరుగుతోందట

Tattoo Size Linked to Higher Cancer Risk

  • 2 వేల మంది కవలలపై పరిశోధించి కనుగొన్న సైంటిస్టులు
  • టాటూ లేనివారితో పోలిస్తే 62 శాతం మందిలో క్యాన్సర్ ముప్పు
  • చర్మ క్యాన్సర్ ముప్పు 137 శాతం పెరుగుతుందని వెల్లడి

సరదా కోసమో, ఇష్టంతోనో శరీరంపై టాటూలు వేయించుకుంటున్నారా? అయితే, ఈ వార్త మీకోసమే. టాటూలతో క్యాన్సర్ ముప్పు పెరుగుతుందని తాజా పరిశోధనలో తేలింది. మీ శరీరంపై వేయించుకునే టాటూ పరిమాణాన్ని బట్టి క్యాన్సర్ ముప్పు అంతగా పెరుగుతుందట. టాటూ ఎంత పెద్దగా ఉంటే క్యాన్సర్ బారిన పడే ప్రమాదం అంతగా పెరుగుతుందని బీఎంసీ పబ్లిక్ హెల్త్ అధ్యయనంలో వెల్లడైంది. రెండు వేల మంది కవలలపై జరిపిన పరిశోధనలో ఈ విషయం బయటపడిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. టాటూ వేయించుకోని వారితో పోలిస్తే టాటూ వేయించుకున్న వారిలో క్యాన్సర్ ముప్పు ఏకంగా 62 శాతం ఎక్కువని తెలిపారు. ప్రధానంగా టాటూలతో చర్మ క్యాన్సర్ వచ్చే ముప్పు 137 శాతం పెరుగుతుందని, బ్లడ్ క్యాన్సర్ ముప్పు అయితే ఏకంగా 173 శాతం పెరుగుతుందని హెచ్చరించారు.

టాటూలు వేసేందుకు వాడే సిరా చర్మంలోని ఇతర కణాలతో కలిసినప్పుడు తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని, ఇది క్యాన్సర్ కు దారితీసే అవకాశం ఎక్కువని బీఎంసీ పబ్లిక్ హెల్త్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సాధారణంగా టాటూలు వేసేందుకు నల్ల సిరా ఉపయోగిస్తారని, ఈ సిరాలోని కార్బన్ బ్లాక్ క్యాన్సర్ కారకమని ‘ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ (ఐఏఆర్ సీ) వెల్లడించింది. శరీరంపై వేసుకున్న టాటూపై సూర్యరశ్మి పడినప్పుడు లేదా టాటూను తొలగించేందుకు లేజర్ చికిత్స తీసుకున్న సందర్భంలో ఆ టాటూ నుంచి అజో కాంపౌండ్స్ విడుదలవుతాయని పరిశోధకులు తెలిపారు. ఇవి శరీరంలో విస్తరించి క్యాన్సర్ ముప్పును మరింత పెంచుతాయని వివరించారు. టాటూ వేసుకున్న ప్రాంతంలో ఏర్పడే వాపు దీర్ఘకాలంలో కణాల ఉత్పత్తిపై చెడు ప్రభావం చూపుతుందన్నారు. దీనివల్ల కణాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుందని, ఇది చర్మం, బ్లడ్ క్యాన్సర్ లకు దారితీస్తుందని హెచ్చరించారు.

Tattoo
Cancer Risk
Skin Cancer
Blood Cancer
Tattoo Ink
Cancer Research
BMC Public Health
International Agency for Research on Cancer
Tattoo Size
Health Risks
  • Loading...

More Telugu News