RCB: సీఎస్‌కే చిత్తు.. 17 ఏళ్ల తర్వాత చెన్నైలో బెంగళూరు విజయం

- వరుసగా రెండో విజయం సాధించిన బెంగళూరు జట్టు
- ఆర్సీబీ బౌలర్ల చేతిలో చెన్నైకి పరాభవం
- కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన రజత్ పటీదార్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో భాగంగా గత రాత్రి చెన్నైలోని చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే)తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు 50 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆర్సీబీకి ఇది వరుసగా రెండో విజయం కాగా, చెన్నైలో 17 ఏళ్ల తర్వాత విజయం సాధించడం విశేషం. ఐపీఎల్ ప్రారంభ సీజన్‌లో రాహుల్ ద్రవిడ్ సారథ్యంలో చెన్నైలో బెంగళూరు జట్టు తొలిసారి విజయం సాధించింది. ఆ తర్వాత అదే ఆఖరి గెలుపుగా మిగిలిపోయింది. మళ్లీ 17 ఏళ్ల తర్వాత ఇన్నాళ్లకు చెపాక్‌లో ఆర్సీబీకి విజయం దక్కింది. ఈ సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)తో జరిగిన తొలి మ్యాచ్‌లో విజయం సాధించిన ఆర్సీబీకి ఇది వరుసగా రెండో విజయం.
ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ నిర్దేశించిన 197 పరుగుల లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో చెన్నై జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 146 పరుగులు మాత్రమే చేయగలిగింది. నిజానికి చెన్నైలో మ్యాచ్ అనగానే బెంగళూరుకు మరో ఓటమి తప్పదని అందరూ భావించారు. అయితే, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ బెంగళూరు బౌలర్లు చెలరేగిపోయారు. క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ చెన్నై బ్యాటర్లను పెవిలియన్ పంపారు. బౌలర్లు పోటీలు పడి వికెట్లు తీశారు. జోష్ హేజల్‌వుడ్ 3 వికెట్లు తీసుకోగా, యశ్ దయాళ్, లివింగ్‌స్టోన్ చెరో రెండు వికెట్లు తీశారు. 8 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన చెన్నై ఆ తర్వాత కోలుకోలేకపోయింది. ఫలితంగా 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 146 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. జట్టులో ఓపెనర్ రచిన్ రవీంద్ర చేసిన 41 పరుగులే అత్యధికం. ధోనీ 30, రవీంద్ర జడేజా 25 పరుగులు చేశారు.
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. కెప్టెన్ రజత్ పటీదార్ మరోమారు కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. 32 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 51 పరుగులు చేశాడు. ఫిల్ సాల్ట్ 32, కోహ్లీ 31, పడిక్కల్ 27, టిమ్ డేవిడ్ 22 పరుగులు చేశారు. చెన్నై బౌలర్లలో నూర్ అహ్మద్ 3 వికెట్లు పడగొట్టగా, మతీశ పథిరణ రెండు వికెట్లు తీసుకున్నాడు. బెంగళూరు కెప్టెన్ రజత్ పటీదార్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు. ఐపీఎల్‌లో నేడు గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడతాయి.