MS Dhoni: కన్ను మూసి తెరిచేంతలో స్టంపింగ్ చేసిన ధోనీ... వీడియో ఇదిగో!

- ఐపీఎల్ లో నేడు చెన్నై సూపర్ కింగ్స్ × రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
- టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఆర్సీబీ
- దూకుడుగా ఆడుతున్న ఆర్సీబీ ఓపెనర్ ఫిల్ సాల్ట్
- మెరుపువేగంతో స్టంపౌట్ చేసిన ధోనీ
43 ఏళ్ల వయసులోనూ భారత క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో వికెట్ల వెనుక మెరుపు వేగంతో కదులుతున్నాడు. నేడు చెన్నైలో సీఎస్కే, ఆర్సీబీ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఆర్సీబీ ఓపెనర్ ఫిల్ సాల్ట్ దూకుడైన ఇన్నింగ్స్‌కు ధోనీ అడ్డుకట్ట వేశాడు. నూర్ అహ్మద్ వేసిన ఐదో ఓవర్‌లో సాల్ట్‌ను ధోనీ మెరుపు వేగంతో స్టంపింగ్ చేశాడు.
నూర్ అహ్మద్ వేసిన బంతికి ఫిల్ సాల్ట్ లైన్ మిస్సయ్యాడు. షాట్ ఆడేందుకు సాల్ట్ ప్రయత్నించగా, బంతి ధోనీ గ్లోవ్స్ లోకి వెళ్లింది. రెప్పపాటు వేగంతో ధోనీ బెయిల్స్ ను గిరాటేసి అప్పీల్ కు వెళ్లాడు. రీప్లేలో కొన్ని మిల్లీమీటర్ల ఎత్తులో సాల్ట్ కాలు గాలిలో ఉన్నట్టు కనిపించింది. దాన్నిబట్టే ధోనీ ఎంత వేగంతో స్టంపింగ్ చేశాడో అర్థం చేసుకోవచ్చు.
సాధారణంగా భారత క్రికెటర్లను విమర్శించడానికి ప్రాధాన్యమిచ్చే ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ కూడా ధోనీ స్టంపింగ్ చూసి నివ్వెరపోయాడు. ధోనీ వేగం దిగ్భ్రాంతి కలిగించిందని పేర్కొన్నాడు.
ధోనీ చేతిలో బలైన ఆర్సీబీ ఓపెనర్ ఫిల్ సాల్ట్ నేటి మ్యాచ్ లో కేవలం 16 బంతుల్లోనే 5 ఫోర్లు, 1 సిక్స్ తో 32 పరుగులు చేశాడు.
కాగా, ధోనీ వికెట్ల వెనుక తన మెరుపు వేగాన్ని ప్రదర్శించడం ఇది వారం రోజుల్లో రెండోసారి. ముంబై ఇండియన్స్‌తో జరిగిన ప్రారంభ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్‌ను కూడా ఇలాగే కన్నుమూసి తెరిచేంతలో వేగంతో స్టంపింగ్ చేశాడు.