Donald Trump: వైట్ హౌస్ లో ముస్లింలకు ఇఫ్తార్ విందు... విందు నచ్చకపోతే ఫిర్యాదు చేయొద్దన్న ట్రంప్

Trump Hosts Iftar Dinner at White House

  • ముస్లింలకు కృతజ్ఞతలు తెలిపిన ట్రంప్
  • గతేడాది ఎన్నికల్లో ముస్లింలకు తనకు మద్దతు పలికారని వెల్లడి
  • ఇఫ్తార్ విందు సందర్భంగా రంజాన్ ప్రాముఖ్యతను గుర్తుచేసిన వైనం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్‌లో ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. గతేడాది నవంబరులో జరిగిన ఎన్నికలలో మద్దతు తెలిపిన అమెరికన్ ముస్లింలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రంజాన్ ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ, మధ్యప్రాచ్యంలో శాంతి కోసం తన ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వివరించారు.

ఈ విందులో ట్రంప్ మాట్లాడుతూ, 2024 అధ్యక్ష ఎన్నికలలో రికార్డు స్థాయిలో మద్దతు తెలిపిన అమెరికన్ ముస్లింలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల ప్రచారం ప్రారంభంలో ముస్లింల మద్దతో ఓ మోస్తరుగానే ఉన్నప్పటికీ, నవంబర్‌లో ఎన్నికల నాటికి ముస్లింలు తనకు అండగా నిలిచారని వివరించారు. తాను అధ్యక్షుడిగా ఉన్నంత కాలం ముస్లిం సమాజానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

పవిత్రమైన రంజాన్ మాసంలో ముస్లింలు తెల్లవారుజాము నుంచి సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉండి, ప్రార్థనలపై దృష్టి పెడతారని ట్రంప్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు ప్రతిరోజూ కుటుంబాలు మరియు స్నేహితులతో కలిసి అల్లాహ్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ ఇఫ్తార్ విందుతో ఉపవాసం విరమిస్తారని పేర్కొన్నారు. ప్రపంచ శాంతి కోసం తామంతా ఎదురు చూస్తున్నామని స్పష్టం చేశారు. ఇక, తాను ఇచ్చి ఈ ఇఫ్తార్ ఈ విందు మీకు నచ్చుతుందని ఆశిస్తున్నానని, నచ్చకపోతే ఫిర్యాదు చేయవద్దని సరదాగా అన్నారు.

2023 అక్టోబర్ నుంచి ఇజ్రాయెల్, హమాస్ మధ్య కొనసాగుతున్న సంఘర్షణ నేపథ్యంలో, మధ్యప్రాచ్యంలో శాంతిని నెలకొల్పడానికి తన ప్రభుత్వం చేస్తున్న దౌత్యపరమైన ప్రయత్నాలను ట్రంప్ ప్రస్తావించారు. అమెరికా, ఈజిప్ట్, ఖతార్ మధ్యవర్తిత్వంతో జనవరిలో జరిగిన కాల్పుల విరమణ మార్చి 18న ముగిసిన తర్వాత పోరాటం మళ్లీ ప్రారంభమైంది. ప్రతి ఒక్కరికీ ఆశాజనకమైన భవిష్యత్తును సృష్టించడానికి తన ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. "మిమ్మల్ని ప్రేమించే వ్యక్తి వైట్ హౌస్‌లో ఉన్నాడు" అని ట్రంప్ ఉద్ఘాటించారు.

Donald Trump
White House
Iftar Dinner
American Muslims
Ramadan
Middle East Peace
2024 Elections
Israel-Hamas Conflict
US Foreign Policy
Muslim Community
  • Loading...

More Telugu News