Andhra Pradesh: మండిపోతున్న ఏపీ.. నేడు తీవ్ర వడగాలులు

- ఏపీలో పలుచోట్ల 42 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు
- ఈరోజు 83 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం
- ఎండకు దూరంగా ఉండాలని విపత్తుల నిర్వహణ శాఖ సూచన
ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఏపీలో ఉష్ణోగ్రతలు మరింత ఎక్కువగా ఉన్నాయి. పలుచోట్ల ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు దాటేశాయి. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా 105 ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదయింది. ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు వడగాలులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. ఈ మేరకు అత్యాధునిక టెక్నాలజీ ద్వారా ప్రజల మొబైల్ ఫోన్లకు అప్రమత్త హెచ్చరిక సందేశాలను పంపుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 83 మండలాల్లో తీవ్ర వడగాలులు, 208 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ ఎండీ కూర్మనాథ్ తెలిపారు.
సాధ్యమైనంత వరకు ఎండకు దూరంగా ఉండాలని విపత్తుల నిర్వహణ శాఖ సూచించింది. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. నీరు, నిమ్మరసం, మజ్జిగ, గ్లూకోజ్, కొబ్బరి నీరు, ఓఆర్ఎస్ వంటివి తీసుకోవాలని సూచించింది.