Chakri: చనిపోవడానికి ముందువరకూ సాయం చేసిన 'చక్రి'

సంగీత దర్శకుడిగా వెలిగిన చక్రి
మనసున్న మనిషిగా ఊళ్లో పేరు
ఎంతోమందికి సాయం చేశాడన్న ఫ్రెండ్స్
అతనిని కోల్పోవడం దురదృష్టమని ఆవేదన
చక్రి... సంగీత దర్శకుడిగా తనదైన ముద్ర వేశారు. ఆయన చనిపోయి చాలా కాలం అవుతున్నా, ఆయన స్నేహితులు మాత్రం మరిచిపోలేదు. అలాగే చక్రి పాటలను అభిమానించేవారు కూడా ఆయనను తలచుకుంటూనే ఉన్నారు. తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ తో మాట్లాడుతూ చక్రి స్నేహితులు ఆయనను గుర్తుచేసుకున్నారు.
"చక్రికి చిన్నప్పటి నుంచి పాటలంటే చాలా ఇష్టం. ఆయనకి విపరీతమైన దేశభక్తి ఉండేది. దేశభక్తికి సంబంధించిన పాటలనే ఎక్కువగా పాడేవాడు. అదే ఆయనను సినిమా సంగీతం దిశగా తీసుకుని వెళ్లిందని మేము భావిస్తున్నాము. ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్లిన తరువాత ఆయన చాలా కష్టపడుతూ తనని తాను నిరూపించుకున్నాడు. స్నేహితులతో మాట్లాడుతూనే ఆయన కొన్ని పాటలను కంపోజ్ చేసిన సందర్భాలు ఉన్నాయి" అని అన్నారు.
ప్రతి ఏడాది ఫ్రెండ్షిప్ డే రోజున మా ఊరు నుంచి స్నేహితులమంతా కలిసి హైదరాబాద్ వెళ్లేవాళ్లం. ఆ రోజంతా చక్రి మాతోనే సరాదాగా గడిపేవాడు. గ్రామంలోని తన స్నేహితులు ఎవరు ఇబ్బందుల్లో ఉన్నారని తెలిసినా సాయం చేసేవాడు. స్నేహితుల పిల్లల చదువులకు కూడా తన సాయాన్ని అందించేవాడు. చనిపోవడానికి కొన్ని రోజుల ముందుకు వరకూ కూడా ఆయన అలాగే ఉన్నాడు. చక్రి అంటేనే ఇజమైన స్నేహం... నిస్వార్థమైన సాయం అని మేము అనుకుంటూ ఉంటాము. అలాంటి మిత్రుడిని కోల్పోవడం మా దురదృష్టం" అని చెప్పారు.