SP Charan: నాన్న నాకు చెప్పిన మాట అదే: ఎస్పీ చరణ్

- గాయకుడిగా ఎస్పీ చరణ్ కి మంచి పేరు
- నటుడిగాను బిజీ అవుతున్న గాయకుడు
- తండ్రి ప్రోత్సాహం ఎక్కువగా ఉండేదని వెల్లడి
- ఆయన మాటలను తాను మరిచిపోలేదని వ్యాఖ్య
ఎస్పీ చరణ్ .. గురించి ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. ఒక వైపున సినిమా పాటలతోను .. మరో వైపున పాటల కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరిస్తూ .. ఇంకొక వైపున సినిమాలలో తన బాడీ లాంగ్వేజ్ కి తగిన పాత్రలను చేస్తూ వెళుతున్నాడు. తాజాగా తాను నటించిన సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ లో ఆయన పాల్గొన్నాడు. ఈ సందర్భంలోనే ఆయన తన తండ్రి బాలు గురించి ప్రస్తావించాడు.
" నాన్న ఎప్పుడు చూసినా చాలా బిజీగా ఉండేవారు. నేను కాలేజ్ లో చదువుతున్నప్పుడు కూడా నాకు వారానికి ఒకసారి మాత్రమే కాల్ చేసేవారు. ఆరోగ్యం ఎలా ఉంది? ఏం చేస్తున్నావ్? ఎలా చదువుతున్నావ్? అని అడిగేవారు. డబ్బులు ఉన్నాయా .. ఏమైనా ఇబ్బంది పడుతున్నావా? అని అడిగేవారు అంతే. ఆ తరువాత ఫోన్ ను అమ్మకి ఇచ్చేసేవారు. ఆయన మమ్మల్ని తీసుకుని వెకేషన్ కి ఎక్కడికీ వెళ్లింది లేదు" అని అన్నాడు.
" నేను కొన్ని సినిమాలు నిర్మించాను. ఒక సినిమా హిట్ అయితే పొంగిపోవడం .. ఆ తరువాత సినిమా ఫ్లాప్ అయితే కుంగిపోవడం చేయకు అనేవారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా బ్యాలెన్స్డ్ గా ఉండటం నేర్చుకోమని అనేవారు. సక్సెస్ .. ఫెయిల్యూర్ గురించి తీవ్రంగా ఆలోచన చేయకుండా నీ పనిని నువ్వు సిన్సియర్ గా చేస్తూ వెళ్లు అనేవారు. నన్ను బాగా ఎంకరేజ్ చేసినవారిలో మా ఫాదర్ ముందుంటారు" అని చెప్పారు.