Shoban Babu: సినిమా ఫంక్షన్ల విషయంలో శోభన్ బాబు చెప్పింది కరెక్టేనేమో!

- హీరోగా ఒక వెలుగు వెలిగిన శోభన్ బాబు
- సినిమా ఫంక్షన్లకు దూరంగా ఉంటూ వచ్చిన వైనం
- పొగడ్తలు తెచ్చే ప్రమాదాలను గురించిన ప్రస్తావన
- అందుకే మానేశానంటూ ఇచ్చిన వివరణ
శోభన్ బాబు .. అందాల నటుడు. ఆరడుగుల ఆకర్షణీయమైన పర్సనాలిటీ .. ఆయనకంటూ ఒక స్టైల్. అదే అందరి మనసులలో ఆయనకు చెరగని స్థానాన్ని సంపాదించి పెట్టింది. శోభన్ బాబుతో మాట్లాడటం సంగతి తరువాత .. ఆయనను దూరం నుంచి చూస్తే చాలని అనుకునే రోజులవి. మహిళా అభిమానులను కలిగిన హీరోలు శోభన్ బాబుకి ముందు .. ఆ తరువాత మనకి మరొకరు కనిపించరు. ఇక ఆ జనరేషన్ కి సంబంధించిన వాళ్లు ఆయనను ఇప్పటికీ మరిచిపోలేదు.
శోభన్ బాబు నటన నుంచి పక్కకి తప్పుకోవడానికి ముందు కూడా సినిమా ఫంక్షన్లకు ఆయన హాజరైన సందర్భాలు చాలా తక్కువని చెప్పాలి. ఇక సినిమాలను దూరం పెట్టిన తరువాత, ఫంక్షన్లకు వెళ్లడమనేది పూర్తిగా తగ్గించేశారు. సినిమా ఇండస్ట్రీతో అంతకాలం పాటు అనుబంధాన్ని కలిగిన ఆయన, ఫంక్షన్లను కూడా అవైడ్ చేయడం గురించిన ప్రశ్నలు ఆయనకి ఎదురయ్యాయి. అలాంటి సందర్భాలలో ఆయన తనదైన స్టైల్లోనే జవాబిచ్చారు.
"సినిమా ఫంక్షన్లకు పిలుస్తూనే ఉంటారు. అక్కడికి నేను వెళితే అందుకు తగిన ఫలితం నన్ను పిలిచినవారికి కనిపించాలి. నన్ను పిలిచారు గనుక ఆ సినిమాను .. అందుకు సంబంధించినవాళ్లను నేను పొగడవలసి ఉంటుంది. ఆ పొగడ్తలలో ఏ మాత్రం కాస్త అటు ఇటైనా వాళ్ల అభిమానులు ఊరుకోరు. లేదంటే ఫలానా సినిమా ఫంక్షన్లో ఫలానా వారి గురించి చెప్పినట్టుగా ఈ ఫంక్షన్లో చెప్పలేదంటారు. నా పని నేను చేసుకోకుండా మొహమాటానికిపోయి కొత్త తలనొప్పులు కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. పరిస్థితులలో వస్తున్న మార్పులను గమనించే నేను ఫంక్షన్లకు వెళ్లడం మానేశాను" అని ఆయన ఒక సందర్భంలో చెప్పారు. సినిమా ఫంక్షన్లలో ఏదో ఒకటి మాట్లాడి ఇబ్బంది పెడుతున్నవాళ్లను .. ఇబ్బందులలో పడుతున్నవాళ్లను చూస్తుంటే, శోభన్ బాబు చెప్పింది కూడా ఒక రకంగా నిజమేనని అనిపించడం లేదూ.