Mohammed Yunus: బంగ్లాదేశ్ తో బంధాలు బలహీనపడిన వేళ... మహమ్మద్ యూనస్ కు మోదీ లేఖ

Modis Letter to Bangladeshs Interim Leader Mohammed Yunus

  • నిన్న 53వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకున్న బంగ్లాదేశ్
  • యూనస్ కు, బంగ్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన మోదీ
  • ఇరు దేశాల సంబంధాలను ముందుకు తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉన్నామన్న ప్రధాని

రాజకీయ అస్థిరతతో అట్టుడుకుతున్న బంగ్లాదేశ్ నిన్న 53వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంది. ఈ సందర్భంగా ఆ దేశ తాత్కాలిక ప్రధాని మహమ్మద్ యూనస్ కు భారత ప్రధాని నరేంద్ర మోదీ లేఖ రాశారు. బంగ్లాదేశ్ జాతీయ దినోత్సవం సందర్భంగా మీకు, బంగ్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతున్నానని లేఖలో మోదీ పేర్కొన్నారు. ఈరోజు మన రెండు దేశాల ద్వైపాక్షిక భాగస్వామ్యానికి పునాది పడిన రోజు అని చెప్పారు. మన త్యాగాలు, ఉమ్మడి చరిత్రకు ఈరోజు నిదర్శనమని అన్నారు. బంగ్లా విముక్తి యుద్ధం ఇరు దేశాల సంబంధాలకు మార్గదర్శకంగా కొనసాగుతోందని చెప్పారు. ఇరు దేశాల ప్రయోజనాలు, ఆందోళనలను పరిగణనలోకి తీసుకుని మన సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు భారత్ కట్టుబడి ఉందని మోదీ తెలిపారు. 

బంగ్లాదేశ్ లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా చోటుచేసుకున్న ఆందోళనల నేపథ్యంలో ఆ దేశ ప్రధాని షేక్ హసీనా పదవికి రాజీనామా చేసి... భారత్ కు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె భారత్ లో ఆశ్రయం పొందుతున్నారు. మహమ్మద్ యూనస్ నేతృత్వంలో అక్కడ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. ఆ దేశంలో హిందువులు, మైనార్టీలపై దాడులు జరుగుతున్నాయి. దీనిపై భారత్ ఎప్పటికప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తూ వచ్చింది. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య బంధాలు బలహీనపడ్డాయి. 

హసీనాను బంగ్లాదేశ్ కు అప్పగించాలని ఆ దేశం కోరినప్పటికీ భారత్ స్పందించలేదు. మరోవైపు భారత్-బంగ్లాదేశ్ మధ్య సత్సంబంధాలను కొనసాగించాలని ఇరు దేశాలు చెపుతూ వస్తున్నాయి. ఇటీవల మహమ్మద్ యూనస్ మాట్లాడుతూ... ఇరు దేశాల మధ్య సంబంధాలు బలంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు.

ఇంకోవైపు ఏప్రిల్ 3, 4 తేదీల్లో థాయ్ లాండ్ లో 'బే ఆఫ్ బెంగాల్ ఇనీషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్' (బిమ్ స్టెక్) కూటమి సదస్సు జరగనుంది. ఈ సమావేశాల సందర్భంగా మోదీ, మహమ్మద్ యూనస్ ల మధ్య ద్వైపాక్షిక భేటీ జరుగుతుందనే వార్తలు వచ్చినప్పటికీ... వీరి మధ్య సమావేశం జరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని భారత అధికారులు అభిప్రాయపడుతున్నారు.

Mohammed Yunus
Narendra Modi
Bangladesh
India
Sheikh Hasina
Bilateral Relations
Bangladesh Independence Day
BIMSTEC
Political Instability
Minority Rights
  • Loading...

More Telugu News