KTR: ఉప ఎన్నికలపై కోర్టు నిర్ణయిస్తుంది, రేవంత్ రెడ్డి సీఎంలా వ్యవహరించాలి: కేటీఆర్

- రాష్ట్రంలో ఉప ఎన్నికలు రాబోవన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
- ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై అసెంబ్లీ వేదికగా తీర్పు ఇవ్వాలని చూస్తున్నారని విమర్శ
- సుప్రీంకోర్టు కంటే తాను ఎక్కువ అని సీఎం భావిస్తున్నారని విమర్శ
తెలంగాణలో ఉప ఎన్నికలు నిర్వహించాలా వద్దా అనే అంశం కోర్టు పరిధిలో ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.
శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఉప ఎన్నికలు ఉండబోవని చేసిన ప్రకటనపై ఆయన స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన హోదాను విస్మరిస్తున్నారని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై శాసనసభ వేదికగా తీర్పు వెల్లడించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కోర్టుల్లోని అంశాలపై వ్యాఖ్యలు చేయకూడదనే నిబంధనలు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. ముఖ్యమంత్రి తనను తాను నిబంధనలకు అతీతంగా భావిస్తున్నారని, సుప్రీంకోర్టు కంటే ఎక్కువ అనుకుంటున్నారని అన్నారు.
ముఖ్యమంత్రి వ్యవహారశైలిని న్యాయస్థానాల దృష్టికి తీసుకువెళతామని ఆయన స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా తన బాధ్యతలను గుర్తించి, పాలనపై దృష్టి సారించాలని హితవు పలికారు. ఉప ఎన్నికల నిర్వహణ అంశం కోర్టు నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని ఆయన పునరుద్ఘాటించారు.