Pastor Pagadala Praveen Kumar: పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ మృతి... కేసు వివరాలు వెల్లడించిన ఎస్పీ

Pastor Pagadala Praveen Kumars Death SP Reveals Case Details

  • హైదరాబాద్‌కు చెందిన ప్రవీణ్ మృతదేహాన్ని కొంతమూరు వద్ద గుర్తించినట్లు వెల్లడి
  • అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు వెల్లడి
  • పోస్టుమార్టాన్ని వీడియో రికార్డింగ్ చేశామన్న ఎస్పీ నరసింహ కిషోర్
  • సోమవారం రాత్రి ప్రమాదం జరిగినట్లు గుర్తించామన్న ఎస్పీ
  • ఆధారాలతో మరింత లోతుగా దర్యాఫ్తు చేస్తున్నామన్న ఎస్పీ

పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ మృతికి సంబంధించిన వివరాలను తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ మీడియాకు వెల్లడించారు. హైదరాబాద్ తిరుమలగిరి సమీపంలోని ఎస్‌బీహెచ్ కాలనీకి చెందిన పాస్టర్ ప్రవీణ్ కుమార్ మృతదేహాన్ని రాజమహేంద్రవరం శివారు కొంతమూరు వద్ద రోడ్డు పక్కన నిన్న ఉదయం స్థానికులు గుర్తించారు. ప్రవీణ్ రోడ్డు ప్రమాదంలో చనిపోలేదని, ఆయనను హత్య చేశారని పాస్టర్లు ఆందోళనకు దిగారు.

ప్రభుత్వం స్పందించి విచారణకు ఆదేశించింది. ఈ క్రమంలో ఎస్పీ నరసింహ కిషోర్ ఈ కేసు వివరాలను వెల్లడించారు. రోడ్డు పక్కన మృతదేహం పడి ఉందని పోలీసులకు స్థానికులు సమాచారం అందించినట్లు తెలిపారు. మృతదేహం పక్కనే సెల్‌ఫోన్ గుర్తించారు. ఆయన ఫోన్ నుండి చివరి కాల్ రామ్మోహన్ ఆర్జేవైకి వెళ్లినట్లు గుర్తించారు. రామ్మోహన్‌కు ఫోన్ చేయగా వచ్చి మృతదేహాన్ని చూసి, పగడాల ప్రవీణ్ కుమార్‌దిగా గుర్తించారు.

ప్రవీణ్ హైదరాబాద్‌లో ఉంటున్న విషయం తెలిసి, అక్కడ ఉంటున్న కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. ప్రవీణ్ బావమరిది నిన్న వచ్చి అనుమానాస్పద మృతిగా ఫిర్యాదు చేయడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు. ఘటనా స్థలంలో డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంతో ఆధారాలను సేకరించినట్లు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్‌తో విచారణ జరిపించాలని నిర్ణయించినట్లు తెలిపారు.

డాక్టర్ల బృందంతో పోస్టుమార్టం చేయించామని, ఈ ప్రక్రియ మొత్తాన్ని వీడియో రికార్డింగ్ చేయించామని వెల్లడించారు. కొవ్వూరు టోల్ గేట్ సమీపంలో ప్రవీణ్ ద్విచక్రవాహనంపై వెళుతున్నట్లు గుర్తించామని ఎస్పీ తెలిపారు. సోమవారం రాత్రి గం. 11.43 నిమిషాలకు రోడ్డు ప్రమాదం జరిగినట్లు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా గుర్తించామని తెలిపారు. సేకరించిన ఆధారాలతో మరింత లోతుగా దర్యాఫ్తు చేస్తున్నట్లు చెప్పారు.

విచారణ కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి ఎవరి దగ్గరైనా ఆధారాలు ఉంటే ఇవ్వాలని సూచించారు. పోస్టుమార్టం అనంతరం నిరసన తెలుపుతున్న వారిని ఒప్పించి మృతదేహాన్ని హైదరాబాద్‌కు పంపించామని వెల్లడించారు.

  • Loading...

More Telugu News