Pastor Praveen Kumar: పాస్టర్ ప్రవీణ్ కుమార్ మృతి... చంద్రబాబు కీలక ఆదేశాలు

- రాజమండ్రి శివారులో రోడ్డు ప్రమాదంలో పాస్టర్ మృతి
- పాస్టర్ మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ క్రైస్తవ సంఘాల ఆందోళన
- అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలంటూ చంద్రబాబు ఆదేశం
రాజమండ్రి శివారులో పాస్టర్ ప్రవీణ్ కుమార్ మృతిపై వస్తున్న ఆరోపణలపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో మాట్లాడిన సీఎం పాస్టర్ మృతిపై అన్ని కోణాల్లో దర్యాప్తు జరపాలని ఆదేశించారు. ఈ ఘటనపై రాష్ట్రం హోం మంత్రి అనిత తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిశోర్ కు ఫోన్ చేసి ఘటనపై ఆరా తీశారు. ఘటన జరిగిన ప్రాంతంలో సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించాలని ఆదేశించారు.
రాజానగరం సీఐ వీరయ్యగౌడ్ మాట్లాడుతూ రాజమండ్రి శివారు కొంతమూరు వద్ద రోడ్డు ప్రమాదం జరిగిందని... ఈ ప్రమాదంలో పాస్టర్ ప్రవీణ్ మరణించాడని చెప్పారు. హైదరాబాద్ నుంచి బుల్లెట్ పై బయల్దేరిన ప్రవీణ్... అర్ధరాత్రి సమయంలో ప్రమాదానికి గురయ్యారని తెలిపారు. రహదారి పైనుంచి ప్రమాదవశాత్తు కిందకు జారిపోయారని... వాహనం అతనిపై పడిపోవడంతో ఆయనకు బలమైన గాయాలయ్యాయని, ఈ ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. ఉదయం 9 గంటల వరకు ఆయనను ఎవరూ గమనించలేదని తెలిపారు. మరోవైపు, ప్రవీణ్ కుమార్ మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ క్రైస్తవ సంఘాలు రాజమండ్రిలో ఆందోళన చేపట్టాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు విచారణకు ఆదేశించారు.