Chandrababu Naidu: తెలంగాణ ఎమ్మెల్యే తనపై చేసిన వ్యాఖ్యలపై నవ్వుతూ స్పందించిన చంద్రబాబు

- ఉమ్మడి ఏపీ సీఎంగా ఉన్నప్పుడు టూరిజమే ప్రధానమని చంద్రబాబు అనేవారన్న కూనంనేని
- అప్పుడు తమకు కోపం వచ్చేదని... నిజంగా ఏ ఖర్చూ లేని ఇజం టూరిజమే అని వ్యాఖ్య
- తన వ్యాఖ్యలు అర్థం చేసుకోవడానికి కమ్యూనిస్టులకు 30 ఏళ్లు పట్టిందన్న చంద్రబాబు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలంగాణ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తిని రేకెత్తించాయి. గతంలో ఉమ్మడి ఏపీకి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు... ఏ ఇజం లేదు, టూరిజమే ప్రధానం అనేవారని కూనంనేని గుర్తు చేశారు. ఏ ఇజం లేదంటే అప్పుడు తమకు కోపం వచ్చేదని... కానీ, నిజంగా ఏ ఖర్చూ లేని ఇజం ఏదైనా ఉందంటే అది టూరిజమే అని ఆయన వ్యాఖ్యానించారు.
కూనంనేని వ్యాఖ్యలపై చంద్రబాబు నవ్వుతూ స్పందించారు. ఏ ఇజం లేదంటే అప్పట్లో కమ్యూనిస్టులు తనపై విమర్శలు గుప్పించారని... ఇప్పుడు ఎలాంటి ఖర్చు లేని ఇజం టూరిజమేనని చెపుతున్నారని అన్నారు. తన ఆలోచనలను, మాటలను అర్థం చేసుకోవడానికి వారికి 30 ఏళ్లు పట్టిందని నవ్వూతూ చెప్పారు.
రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు టూరిజం అభివృద్ధికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని... జిల్లా కలెక్టర్లు జిల్లాల వారీగా టూరిజం అభివృద్ధిపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి అన్నారు. టూరిజం ద్వారా స్థానిక ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, ప్రభుత్వానికి ఆదాయం కూడా సమకూరుతుందని చెప్పారు. ఎక్కువ ఖర్చు లేకుండా ఉపాధి కల్పించేది టూరిజమేనని అన్నారు.