Muslim safety: యూపీలో ముస్లింలు భద్రమేనా అంటే సీఎం యోగి ఏమన్నారంటే..?

- దేశంలో ముస్లింలకు అత్యంత సురక్షిత ప్రదేశం ఉత్తరప్రదేశ్ అని వెల్లడి
- ఇక్కడ హిందువులు సేఫ్ గా ఉన్నంతకాలం ముస్లింలు కూడా క్షేమమేనని వివరణ
- వంద హిందూ కుటుంబాల మధ్య ఓ ముస్లిం కుటుంబం నిర్భయంగా జీవిస్తుందన్న యోగి
దేశంలో ముస్లింలకు అత్యంత సురక్షితమైన రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఉత్తరప్రదేశ్ మాత్రమేనని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. ఇక్కడ హిందువులు సురక్షితంగా ఉంటే ముస్లింలు కూడా భద్రంగానే ఉంటారని స్పష్టం చేశారు. హిందువుల ఇళ్లు, దుకాణాలు భద్రంగా ఉన్నంతకాలం ముస్లింలకు వచ్చిన భయమేమీ లేదన్నారు. ఈ మేరకు ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో యోగి ఈ వ్యాఖ్యలు చేశారు. వంద హిందూ కుటుంబాల మధ్య ఒక ముస్లిం కుటుంబం క్షేమంగా జీవించడం చూడొచ్చు కానీ వంద ముస్లిం కుటుంబాల మధ్య 50 హిందూ కుటుంబాలు ఉన్నా కూడా క్షేమం కాదన్నారు.
ఇందుకు ఉదాహరణ బంగ్లాదేశ్, పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్ లలోని హిందువుల పరిస్థితేనని యోగి చెప్పారు. యూపీలో 2017కు ముందు హిందువుల ఇళ్లు, షాపులు తగలబడిన సందర్భాలు చూశామని, అదే సమయంలో ముస్లింల షాపులు కూడా కాలిబూడిదయ్యాయని గుర్తుచేశారు. కానీ 2017 తర్వాత ఈ గొడవలు సమసిపోయాయని, తమ ప్రభుత్వం ఇలాంటి వాటిపట్ల కఠినంగా వ్యవహరిస్తుందని చెప్పారు. కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాలు ‘సబ్ కా సాథ్, సబ్ కా సమ్మాన్’ నినాదంతో ముందుకు వెళుతున్నాయని, సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ స్ఫూర్తిగా ఐకమత్యంతో అభివృద్ధి పథంలో నడుస్తున్నాయని యోగి తెలిపారు.