Amit Shah: వైసీపీ హయాంలో మద్యం అక్రమ దందాపై అమిత్ షా ఆరా.. సమగ్ర దర్యాప్తునకు హామీ

Massive Andhra Pradesh Liquor Scam Under Investigation

  • ఢిల్లీ మద్యం కుంభకోణానికి మించి ఏపీలో మద్యం అక్రమ వ్యాపారం జరిగిందన్న టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయులు
  • పార్లమెంటు సమావేశాలు జరుగుతుండగా తన కార్యాలయానికి పిలిపించుకున్న కేంద్రమంత్రి అమిత్ షా
  • మద్యం కుంభకోణంపై వివరాలు తెలుసుకున్న కేంద్ర హోం మంత్రి

జగన్ ప్రభుత్వ హయాంలో ఏపీలో మద్యం అక్రమ వ్యాపారం జరిగిందన్న టీడీపీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయుల ఆరోపణలపై కేంద్రం స్పందించింది. సోమవారం లోక్‌సభలో లావు మాట్లాడుతూ ఏపీలో మద్యం స్కాంకు కారకులైన వారిపై దర్యాప్తు చేసి, అవసరమైన చర్యలు తీసుకోవాలని, ఈడీ వంటి సంస్థలతో దర్యాప్తు జరిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో నిన్న పార్లమెంటు సమావేశాలు జరుగుతుండగా శ్రీకృష్ణదేవరాయులను ప్రత్యేకంగా తన కార్యాలయానికి పిలిపించుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయనను అడిగి వివరాలు తెలుసుకున్నారు. 

ఢిల్లీ మద్యం కుంభకోణంతో పోల్చితే ఏపీలో ఎన్నో రెట్లు అధికంగా కుంభకోణం జరిగిందని అమిత్ షాకు లావు వివరించారు. ఇందుకు సంబంధించిన పత్రాలను అందజేశారు. రూ. 90 వేల కోట్ల మద్యం వ్యాపారంలో రూ. 18 వేల కోట్లు దుర్వినియోగం అయ్యాయని, మరో రూ. 4 వేల కోట్లు బినామీ పేర్లతో దుబాయ్, ఆఫ్రికాలకు తరలించారన్న ఆరోపణలపైనా అమిత్ షా ఆరా తీసినట్టు తెలిసింది.

హైదరాబాద్‌కు చెందిన ఎన్.సునీల్‌రెడ్డి దుబాయ్‌కు రూ. 2 వేల కోట్లను తరలించినట్టుగా ధ్రువీకరించే కీలక పత్రాలను ఈ సందర్భంగా అమిత్ షాకు ఎంపీ శ్రీకృష్ణదేవరాయులు అందించారు. ఏపీ మద్యం కుంభకోణంపై దర్యాప్తు జరిపిస్తామని ఈ సందర్భంగా హోం మంత్రి ఆయనకు హామీ ఇచ్చినట్టు తెలిసింది. ఈ కుంభకోణం కారణంగానే ఒక ఎంపీ రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకున్నారని ఈ సందర్భంగా లావు వివరించారు. 

ప్రభుత్వ దుకాణాల్లో జరిగిన రూ. 99 వేల కోట్ల అమ్మకాల్లో రూ. 690 కోట్లు మాత్రమే డిజిటల్ లావాదేవీలు జరిగాయని, మిగిలిన సొమ్ము నుంచి అత్యధిక భాగం జగన్, ఆయన అనుయాయులు కొల్లగొట్టారని లావు ఆరోపించారు. 2019-24 మధ్య వైసీపీ ప్రభుత్వం 38 కొత్త బ్రాండ్లను ప్రవేశపెట్టిందని, అవన్నీ అధికార పార్టీ అనుబంధ వ్యాపారులకు చెందినవని వివరించారు. మద్యం విక్రయాల ద్వారా 26 కొత్త కంపెనీలు భారీగా లాభాలు ఆర్జించాయని, రూ.20,356 కోట్ల విలువైన మద్యం అమ్మకాలను గోప్యంగా నిర్వహించారని ఎంపీ లావు ఆరోపించారు.

More Telugu News