BYD: తెలంగాణకు భారీ పెట్టుబడి.. యూనిట్ స్థాపనకు ముందుకొచ్చిన ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం బీవైడీ

BYD to set up Electric Vehicle Unit in Telangana

  • గత కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వంతో బీవైడీ చర్చలు
  • మూడు ప్రాంతాలను ప్రతిపాదించిన ప్రభుత్వం
  • త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం
  • ప్రస్తుతం చైనా నుంచి కార్లు దిగుమతి చేసుకుని విక్రయిస్తున్న సంస్థ

చైనాకు చెందిన విద్యుత్తు కార్ల తయారీ సంస్థ బీవైడీ హైదరాబాద్‌లో ఫ్యాక్టరీ స్థాపించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. ఈ మేరకు ప్రభుత్వంతో కొంతకాలంగా జరుగుతున్న చర్చలు ఫలించినట్టు సమాచారం. బీవైడీ యూనిట్ స్థాపనకు అవసరమైన భూమిని కేటాయించడంతోపాటు అన్ని రకాలుగా మద్దతు ఇస్తామని బీవైడీకి ప్రభుత్వం హామీ ఇచ్చినట్టు తెలిసింది. యూనిట్ ఏర్పాటుకు హైదరాబాద్‌లోని మూడు ప్రదేశాలను ప్రభుత్వం ప్రతిపాదించగా, సంస్థ ప్రతినిధులు పరిశీలిస్తున్నట్టు తెలిసింది. మూడింటిలో ఒకదానిని ఎంపిక చేయగానే ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉంది. ఇది కార్యరూపం దాల్చితే విద్యుత్తు కార్ల విభాగంలో అతిపెద్ద ప్రైవేటు రంగ ప్రాజెక్టును, భారీ పెట్టుబడిని దక్కించుకున్న ఘనత తెలంగాణకు దక్కుతుంది. బీవైడీ తన ప్లాంట్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తే దాని అనుబంధ పరిశ్రమలు కూడా ఏర్పాటై ఎంతోమందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి.

బీవైడీ సంస్థ ప్రస్తుతం చైనా నుంచి కార్లు దిగుమతి చేసుకుని భారత్‌లో విక్రయిస్తోంది. దిగుమతి సుంకాలు అధికంగా ఉండటంతో కార్ల ధర ఎక్కువగా ఉంటోంది. ఇది కార్ల విక్రయంపై ప్రభావం చూపుతోంది. హైదరాబాద్‌లో ప్లాంట్ ఏర్పాటు చేస్తే కార్ల ధర దిగివస్తుంది. చైనా, ఐరోపా దేశాల్లో టెస్లా కార్ల అమ్మకాలు తగ్గుతుంటే బీవైడీ కార్ల అమ్మకాలు పెరుగుతున్నాయి. కార్ల బ్యాటరీని 5 నుంచి 8 నిమిషాల వ్యవధిలోనే పూర్తిగా రీచార్జ్ చేయగలిగే ఒక మెగావాట్ ఫ్లాష్ చార్జర్‌ను ఇటీవల ఈ సంస్థ విడుదల చేసింది. దీంతో ఒకసారి చార్జ్ చేసి 400 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. కాగా, బీవైడీ సంస్థ కార్ల యూనిట్‌తోపాటు 20 గిగావాట్ల బ్యాటరీ ప్లాంట్‌ను కూడా ఏర్పాటు చేయాలని భావిస్తోంది. 

  • Loading...

More Telugu News