Mohanlal: తెలుగులో లూసిఫర్-2 రీమేక్ చేయలేరు: మోహన్ లాల్

- గాడ్ ఫాదర్ 2 పై కీలక వ్యాఖ్యలు చేసిన మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్
- ‘L 2’ రీమేక్‌గా గాడ్ ఫాదర్ 2 రూపొందించలేరని కామెంట్
- లూసిఫర్‌లో ఉన్న కొన్ని పాత్రలు తెలుగు రీమేక్ ‘గాడ్ ఫాదర్’లో లేవని వెల్లడి
మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ 'గాడ్ ఫాదర్ 2' పై కీలక వ్యాఖ్యలు చేశారు. పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో మోహన్ లాల్ హీరోగా తెరకెక్కిన చిత్రం 'లూసిఫర్' ఘన విజయం సాధించడంతో, దీనికి కొనసాగింపుగా 'L 2' రూపొందించారు. ఈ చిత్రం మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా 'L 2' ప్రచారంలో పాల్గొన్న మోహన్ లాల్, మెగాస్టార్ చిరంజీవి నటించిన 'గాడ్ ఫాదర్' గురించి మాట్లాడారు. 'L 2' ఆధారంగా 'గాడ్ ఫాదర్ 2'ను రూపొందించలేరని ఆయన అభిప్రాయపడ్డారు.
మలయాళంలో తాను నటించిన ఎన్నో సినిమాలు ఇతర భాషల్లో రీమేక్ అయ్యాయని, ఆ క్రమంలో 'లూసిఫర్' ఆధారంగా తెలుగులో రూపొందించిన 'గాడ్ ఫాదర్' మూవీని తాను చూశానన్నారు. ఒరిజినల్ సినిమా కథలో మార్పులు చేసి ఆ చిత్రాన్ని రూపొందించారని, 'లూసిఫర్'లో ఉన్న కొన్ని పాత్రలు తెలుగు రీమేక్‌లో లేవని, అందుకే 'L 2' ఆధారంగా వాళ్లు 'గాడ్ ఫాదర్ 2' తెరకెక్కించలేరని మోహన్ లాల్ స్పష్టం చేశారు.
మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి హీరోగా 'లూసిఫర్' రీమేక్‌గా తెలుగులో 'గాడ్ ఫాదర్' తెరకెక్కింది. ఈ సినిమా 2022లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే 'లూసిఫర్'లో ఉన్న టోవినో థామస్ పాత్రను తెలుగు రీమేక్‌లో తొలగించారు. తాజాగా విడుదలైన 'L 2' ట్రైలర్‌లో టోవినో థామస్ కీలక పాత్రలో కనిపించనున్నట్లు ఉంది. అందుకే దీని ఆధారంగా 'గాడ్ ఫాదర్ 2' రూపొందించలేరని మోహన్ లాల్ అభిప్రాయపడి ఉంటారని భావిస్తున్నారు.