Kunaneni Sambasiva Rao: తెలంగాణ అసెంబ్లీలో చంద్రబాబుపై కూనంనేని ఆసక్తికర వ్యాఖ్యలు

- చంద్రబాబు అప్పట్లో టూరిజం అంటే కోపంగా ఉండేదన్న సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని
- ఇప్పుడు ఖర్చు లేని ఇజం టూరిజమేనని వ్యాఖ్య
- తెలంగాణలోని పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వానికి సూచన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిపై తెలంగాణ అసెంబ్లీలో సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి ఏపీలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఏ ఇజమూ లేదని, ఇక టూరిజమే ప్రధానమని అనేవారని కూనంనేని గుర్తు చేసుకున్నారు. ఏ ఇజమూ లేదంటే అప్పుడు తమకు కోపం వచ్చేదని కానీ, నిజంగా ఖర్చు లేని ఇజం ఏదైనా ఉందంటే అది టూరిజమేనని వ్యాఖ్యానించారు. బడ్జెట్ పద్దులపై నిన్న శాసనసభలో జరిగిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో అనేక పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని, వాటిని అభివృద్ధి చేయాలని ప్రభుత్వానికి సూచించారు. నేలకొండపల్లి, పాపికొండలు, నాగార్జునసాగర్ వంటి ప్రాంతాలను అభివృద్ధి చేసి రాష్ట్రాన్ని పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దాలని కోరారు. భద్రాద్రి ఆలయానికి ఉమ్మడి ఏపీ హయాంలోనే అన్యాయం జరిగిందని, ఈ ఆలయాన్ని అభివృద్ధి చేస్తే రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద పర్యాటక ప్రాంతం అవుతుందని పేర్కొన్నారు.
నాలుగు లైన్ల రహదారి ఉండటం వల్ల హైదరాబాద్ నుంచి ఖమ్మం 3 గంటల్లో వెళ్లిపోతుంటే, ఖమ్మం నుంచి కొత్తగూడెం వెళ్లేందుకు 3 గంటల వరకు పడుతోందని కూనంనేని ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మంలో గత పదేళ్లలో రోడ్లు వేయలేదని, ఈ ప్రభుత్వం వచ్చాక రహదారుల అభివృద్ధి పనులపై సంతృప్తిగానే ఉన్నట్టు చెప్పారు. కాంగ్రెస్‌తో తమది స్నేహపూరిత బంధమని పేర్కొన్నారు. వీలైతే మద్యపాన నిషేధం తీసుకొస్తే సంతోషిస్తామని అన్నారు. కల్లుగీతను పరిశ్రమగా గుర్తిస్తే కొన్ని వేల కుటుంబాలకు మేలు జరుగుతుందని కూనంనేని పేర్కొన్నారు.