Shreyas Iyer: శ్రేయాస్ అయ్యర్ బాదుడు.. పంజాబ్ కింగ్స్ శుభారంభం

Shreyas Iyers Blitz Leads Punjab Kings to Victory

  • 97 పరుగులతో సెంచరీకి మూడు పరుగుల ముందు నిలిచిపోయిన అయ్యర్
  • భారీ స్కోర్ల మ్యాచ్‌లో పంజాబ్‌దే పైచేయి
  • చేతిలో కావాల్సినన్ని వికెట్లు ఉన్నప్పటికీ చతికిలపడిన గుజరాత్ టైటాన్స్

మూడు పరుగుల తేడాతో శ్రేయాస్ అయ్యర్ సెంచరీ ముందు నిలిచిపోయినప్పటికీ తొలి మ్యాచ్‌లో జట్టుకు విజయాన్ని అందించాడు. గత రాత్రి అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ ఇంటర్నేషనల్ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్‌ చివరి వరకు ఉత్కంఠగా సాగింది.

పంజాబ్ నిర్దేశించిన 243 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన గుజరాత్ టైటాన్స్ జట్టు దీటుగానే బదులిచ్చింది. ఒకానొక దశలో 199/3తో లక్ష్యానికి దగ్గరైంది. అయితే, పంజాబ్ బౌలర్లు పొదుపుగా బౌలింగ్ చేయడం, గుజరాత్ వరుసగా వికెట్లు కోల్పోవడంతో చేతిలో మరో ఐదు వికెట్లు ఉన్నప్పటికీ 232 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. 

సాయి సుదర్శన్ 41 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లతో 74 పరుగులు చేయగా, కెప్టెన్ శుభమన్ గిల్ 14 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 33 పరుగులు చేశాడు. జోస్ బట్లర్ 33 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 54, షెర్ఫాన్ రూథర్‌ఫర్డ్ 28 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 46 పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ సింగ్ రెండు వికెట్లు తీసుకున్నాడు.

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 243 పరుగుల భారీ స్కోరు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ మైదానంలో పరుగుల వర్షం కురిపించాడు. 42 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్సర్లతో 97 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య 23 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 47 పరుగులు, శశాంక్ సింగ్ 16 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 44 పరుగులు చేశారు. అజ్మతుల్లా 16, స్టోయినిస్ 20 పరుగులు చేశారు. గుజరాత్ బౌలర్లలో సాయికిషోర్‌ 3 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్‌లో నేడు రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య గువాహటిలో మ్యాచ్ జరగనుంది.

  • Loading...

More Telugu News