Rangnath: చెరువులను పరిశీలించిన హైడ్రా కమిషనర్... కొత్తకుంట చెరువులో మట్టి నింపిన బిల్డర్లపై ఆగ్రహం

- కొత్తకుంట చెరువు, తమ్మిడికుంట, సున్నం చెరువులను పరిశీలించిన రంగనాథ్
- కొత్తకుంట ఎఫ్‌టీఎల్ పరిధిలో మట్టి నింపుతున్న వంశీరామ్ బిల్డర్స్‌పై ఆగ్రహం
- మూడ్రోజుల్లో మట్టిని తొలగించాలని ఆదేశం
హైడ్రా కమిషనర్ రంగనాథ్ హైదరాబాద్ నగరంలోని పలు చెరువులను పరిశీలించారు. ఖాజాగూడలోని కొత్తకుంట చెరువు ఎఫ్‌టీఎల్‌ను మట్టితో నింపుతున్న వంశీరామ్ బిల్డర్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తకుంట ఎఫ్‌టీఎల్‌లో మట్టిని మూడు రోజుల్లో తొలగించాలని బిల్డర్లను హెచ్చరించారు. మట్టిని తొలగిస్తామని వంశీరామ్ బిల్డర్లు కూడా తెలిపారు.
కొత్తకుంట ఎఫ్‌టీఎల్ పరిధిలో నిర్మాణాలు జరుగుతున్నాయని ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పరిస్థితిని కమిషనర్ పరిశీలించారు. ఇదే విషయమై ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి కూడా హైడ్రాకు ఫిర్యాదు చేశారు. చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిని తెలుసుకోవడానికి జాయింట్ ఇన్‌స్పెక్షన్ చేయాలని అన్నారు.
ఆ తర్వాత మాదాపూర్‌లోని తమ్మిడికుంట, బోరబండ సమీపంలోని సున్నం చెరువును సందర్శించారు. ఈ రెండు చెరువుల్లో పూడికతీత పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సూచించారు. చెరువుల చుట్టూ తిరిగి, సుందరీకరణ, పచ్చదనం పెంచేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించారు.
హైడ్రా ఈ ఏడాది చేపట్టిన ఆరు చెరువుల పునరుద్ధరణ, అభివృద్ధి, సుందరీకరణ పనులు వచ్చే వర్షాకాలానికి పూర్తి కావాలని, పనుల్లో ఎక్కడా జాప్యం, అలసత్వం లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.