Manoj Bharathiraja: ప్రముఖ దర్శకుడు భారతీరాజా తనయుడు మనోజ్ భారతీరాజా కన్నుమూత

- కోలీవుడ్ లో తీవ్ర విషాదం
- నటుడు, దర్శకుడు మనోజ్ భారతీరాజా కన్నుమూత
- గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన వైనం
ప్రముఖ తమిళ దర్శకుడు భారతీరాజా తనయుడు, నటుడు, దర్శకుడు మనోజ్ భారతీరాజా గుండెపోటుతో మంగళవారం సాయంత్రం చెన్నైలో మరణించారు. ఆయన వయస్సు 48 సంవత్సరాలు.
కొన్ని నెలల క్రితం మనోజ్ భారతీరాజాకి గుండెకు సంబంధించిన శస్త్రచికిత్స జరిగిందని, ఆయన కోలుకుంటున్నారని సినీ పరిశ్రమ వర్గాలు తెలిపాయి. మనోజ్ భారతికి భార్య నందన, కుమార్తెలు అర్షిత, మదివధని ఉన్నారు.
మనోజ్ 1999లో తండ్రి భారతీరాజా దర్శకత్వంలో వచ్చిన రొమాంటిక్ డ్రామా ‘తాజ్ మహల్’ ద్వారా నటుడిగా పరిచయం అయ్యారు. ఈ చిత్రంలో రియా సేన్ కథానాయికగా నటించగా, మణిరత్నం రచనా సహకారం అందించారు. ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అందించగా, బి.కణ్ణన్, మధు అంబత్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తించారు.
‘తాజ్ మహల్’ తర్వాత మనోజ్ భారతీరాజా అనేక చిత్రాల్లో నటించారు. ఆయన నటించిన చిత్రాల్లో ‘కడల్ పూకల్’, ‘అల్లి అర్జున’, ‘విరుమాన్’, ‘మానాడు’ ముఖ్యమైనవి.
2023లో మనోజ్ భారతీరాజా దర్శకుడిగా మారి ‘మార్గళి తింగాల్’ చిత్రాన్ని రూపొందించారు. దాదాపు 20 సంవత్సరాలు నటుడిగా కొనసాగిన తర్వాత ఆయన దర్శకత్వం వైపు అడుగులు వేశారు. ఈ చిత్రంలో ఆయన తండ్రి భారతీరాజాతో పాటు శ్యామ్ సెల్వన్, రక్షణా నటించారు. ఇళయరాజా సంగీతం అందించారు.
మనోజ్ భారతీరాజా మృతితో కోలీవుడ్ విషాదంలో మునిగిపోయింది. రాజకీయ నాయకులు, నటీనటులు, సినీ పరిశ్రమ ప్రముఖులు సంతాపం తెలిపారు.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ సంతాప సందేశం వెలువరించారు. "దర్శకుడు భారతీరాజా కుమారుడు, నటుడు, దర్శకుడు మనోజ్ భారతీరాజా మరణ వార్త విని నేను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. తన తండ్రి చిత్రం తాజ్ మహల్ ద్వారా పరిచయమైన మనోజ్ భారతీరాజా, ‘సముద్రం’, ‘అల్లి అర్జున’ వంటి అనేక చిత్రాలలో నటించి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. అతను దర్శకత్వంలోనూ ప్రతిభ చాటుకున్నాడు. ఇంత చిన్న వయస్సులో ఆయన మరణం షాకింగ్‌కు గురిచేసింది. దర్శకుడు భారతీరాజా, మనోజ్ కుటుంబ సభ్యులకు, సినీ పరిశ్రమలోని స్నేహితులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను" అని పేర్కొన్నారు.