Shreyas Iyer: శ్రేయాస్ అయ్యర్ విధ్వంసం, శశాంక్ సింగ్ మెరుపు దాడి... మోదీ స్టేడియంలో పరుగుల సునామీ!

- ఐపీఎల్ లో నేడు గుజరాత్ టైటాన్స్ × పంజాబ్ కింగ్స్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్
- 20 ఓవర్లలో 5 వికెట్లకు 243 పరుగులు చేసిన పంజాబ్
- 42 బంతుల్లో 97 పరుగులు చేసిన శ్రేయాస్ అయ్యర్
- 16 బంతుల్లో 44 రన్స్ కొట్టిన శశాంక్
ఐపీఎల్ 18వ సీజన్ లో పరుగుల మోత మోగుతోంది. దాదాపు అన్ని జట్లు దూకుడుగా ఆడేందుకు ప్రాధాన్యమిస్తున్నాయి. ఇవాళ పంజాబ్ కింగ్స్ కూడా గుజరాత్ టైటాన్స్ పై అటాకింగ్ గేమ్ ఆడింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన గుజరాత్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దాంతో మొదట బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ జట్టు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో పరుగుల సునామీ సృష్టించింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 243 పరుగులు చేసింది.
ముఖ్యంగా పంజాబ్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ విధ్వంసక ఇన్నింగ్స్ తో అలరించాడు. అయ్యర్ 42 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్సర్లతో 97 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. చివరి ఓవర్లో అతడికి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. దాంతో సెంచరీ సాధించే అవకాశం చేజారింది. పవర్ గేమ్ కు ప్రాధాన్యత ఇచ్చిన అయ్యర్, భారీ సిక్సర్లతో గుజరాత్ బౌలర్లను హడలెత్తించాడు.
మరో ఎండ్ లో శశాంక్ సింగ్ సుడిగాలి ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. గత సీజన్ లో తన ఆట గాలివాటం కాదని నిరూపించుకుంటూ శశాంక్ సింగ్ రెచ్చిపోయాడు. కేవలం 16 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సులతో అజేయంగా 44 పరుగులు చేశాడు. ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ శశాంక్ సింగ్ ఏకంగా 5 ఫోర్లు బాదాడు. ఆ ఓవర్ విసిరింది మహ్మద్ సిరాజ్.
అంతకుముందు, పంజాబ్ ఇన్నింగ్స్ ఆరంభంలో ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య దూకుడుగా ఆడి 23 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సులతో 47 పరుగులు చేశాడు. అజ్మతుల్లా ఒమర్జాయ్ 16, మార్కస్ స్టొయినిస్ 20 పరుగులు చేశారు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో సాయి కిశోర్ 3, రబాడా 1, రషీద్ ఖాన్ 1 వికెట్ తీశారు.