Pullayya: రూ.100 కోట్ల చిట్టీల సొమ్ముతో పరారైన పుల్లయ్య బెంగళూరులో అరెస్ట్

Chitfund Scamster Pullayya Nabbed in Bengaluru

  • చిట్టీల పేరిట రూ.100 కోట్లకు టోకరా వేసిన పుల్లయ్య
  • హైదరాబాదులో ఇల్లు ఖాళీ చేసి పరారీ
  • దాదాపు 2 వేల మంది నుంచి చిట్టీలు వసూలు
  • సీసీఎస్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన బాధితులు

గత నెలలో హైదరాబాదులో పుల్లయ్య అనే వ్యక్తి రూ.100 కోట్ల మేర చిట్టీల సొమ్ము వసూలు చేసి పరారైన సంగతి సంచలనం సృష్టించింది. దాదాపు 2 వేల మంది నుంచి అతడు చిట్టీల పేరుతో నగదు వసూలు చేసి, తిరిగి చెల్లించకుండా పారిపోవడంతో బాధితులు లబోదిబోమన్నారు. అతడిపై హైదరాబాద్ సీసీఎస్ పోలీస్ స్టేషన్ లో బాధితులు ఫిర్యాదు చేశారు. 

కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు... ఎట్టకేలకు చిట్టీల పుల్లయ్యను బెంగళూరులో అరెస్ట్ చేశారు. అతడితోపాటు రామాంజనేయులు అనే వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరినీ బెంగళూరు నుంచి హైదరాబాద్ తరలించారు. 

పుల్లయ్య స్వస్థలం అనంతపురం జిల్లా చందన లక్ష్మీపల్లి గ్రామం. హైదరాబాదులోని ఎస్సార్ నగర్ లో చిట్టీల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. రూ.5 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు చిట్టీలు నిర్వహిస్తుంటాడు. మొదట్లో చెల్లింపులు సక్రమంగా జరపడంతో ఖాతాదారులు మరింత పెరిగారు. ఇదే అదనుగా, అందినకాడికి వసూలు చేసుకుని ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయాడు. 

18 ఏళ్ల క్రితం నగరానికి వచ్చిన అతడు మొదట్లో అడ్డ మీద కూలీగా పనిచేశాడు. స్థానికులతో పరిచయాలు పెంచుకుని క్రమంగా చిట్టీల వ్యాపారంలో దిగాడు.  

  • Loading...

More Telugu News