Revanth Reddy: అత్తగారింటికి, తన భూములున్న ప్రాంతానికి రేవంత్ రెడ్డి రోడ్డు వేసుకుంటున్నారు: హరీశ్ రావు

- రైతుబంధు ఇచ్చేందుకు డబ్బులు లేవని చెబుతున్నారని విమర్శ
- హెచ్ఎండీఏలో రూ. 20 వేల కోట్లతో టెండర్లు ఎలా పిలుస్తున్నారని ప్రశ్న
- రుణమాఫీపై దేవుళ్ల మీద ఒట్టేసి మోసం చేశారని విమర్శ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన అత్తగారిల్లు, ఆయన భూములు ఉన్న ఆమన్‌గల్‌కు రూ. 5 వేల కోట్లతో రోడ్డు ఎలా వేస్తున్నారో చెప్పాలని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు ప్రశ్నించారు. రైతుబంధు ఇచ్చేందుకు డబ్బులు లేవని పదేపదే చెబుతున్నారని, కానీ హెచ్ఎండీఏలో రూ. 20 వేల కోట్లతో టెండర్లు ఎలా పిలుస్తున్నారని ఆయన నిలదీశారు.
రుణమాఫీపై దేవుళ్ల మీద ఒట్టేసి ముఖ్యమంత్రి మోసం చేశారని ఆయన విమర్శించారు. అసెంబ్లీలో రుణమాఫీపై ప్రశ్నిస్తే ప్రతిదాడులు, సస్పెన్షన్లు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బయట ప్రశ్నిస్తే పోలీసు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. రుణమాఫీ సహా వివిధ హామీలపై కాంగ్రెస్ నేతలను రైతులు ఎక్కడికక్కడ నిలదీయాలని పిలుపునిచ్చారు.
వడగండ్ల వాన వల్ల రైతులందరూ నష్టపోయారని, వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 30 వేలు నష్టపరిహారం చెల్లించాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. శాసనసభను వేదిక చేసుకొని రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.