KL Rahul: ఇదిగో కేఎల్ రాహుల్ కుమార్తె అంటూ ఫొటో వైరల్... అసలు విషయం ఇదే!

- కేఎల్ రాహుల్, అతియా శెట్టి దంపతులకు కుమార్తె
- నకిలీ ఫొటో వైరల్ అవుతున్న వైనం
- అది ఏఐ ఫొటో అని నిర్ధారణ!
ప్రముఖ క్రికెటర్ కేఎల్ రాహుల్, అతియా శెట్టి దంపతులకు కుమార్తె కలిగిన సంగతి తెలిసిందే. అయితే కేఎల్ రాహుల్, అతియా ఓ పాపను చేతిలోకి తీసుకుని ఉన్న ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అయితే, అది నకిలీ ఫొటో అని తేలింది. ఆ ఫొటోను ఏఐ టెక్నాలజీతో రూపొందించినట్టు గుర్తించారు. రాహుల్, అతియా దంపతులు తాము తల్లిదండ్రులైన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేసిన కొన్ని గంటల్లోనే, ఏఐతో రూపొందించిన ఫొటో వైరల్ అయింది. ఇది ఒరిజినల్ ఫొటోలా కనిపించడంతో చాలా మంది దీనిని నిజమని నమ్మి షేర్ చేశారు.
అయితే, ఈ ఫోటో ఫేక్ అని అనేక విషయాలు స్పష్టం చేస్తున్నాయి. కేఎల్ రాహుల్ గానీ, లేదా అతియా శెట్టి గానీ తమ కుమార్తె ఫొటోను అధికారికంగా షేర్ చేయలేదు. అలాగే, రాహుల్ మామ, బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కూడా సోషల్ మీడియాలో ఎటువంటి పోస్ట్ చేయలేదు.
ముఖ్యంగా... ఛాంపియన్స్ ట్రోఫీలో జుట్టుతో కనిపించిన రాహుల్, ఈ ఫోటోలో హెయిర్ కట్‌తో ఉండడం గమనార్హం. అంతేకాకుండా, ఈ ఫొటో 99 శాతం ఏఐ ద్వారా రూపొందించినట్టు ఏఐ డిటెక్టర్ టూల్స్ ద్వారా నిర్ధారణ అయింది.
రాహుల్ కుమార్తె పుట్టకముందే ఇలాంటి ఏఐ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గత సంవత్సరం నవంబర్‌లో తాము తల్లిదండ్రులు కాబోతున్నామని ఈ జంట ప్రకటించిన తర్వాత, రెండు నెలలకే ఈ ఏఐ ఫోటోలు కనిపించాయి.
వైరల్ అవుతున్న ఏఐ ఫొటో ఇదే...
