Prateek Jain: ఇండస్ట్రియల్ పార్కుకు భూములిచ్చిన రైతులకు నష్టపరిహారం: వికారాబాద్ జిల్లా కలెక్టర్

- కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లాస్థాయి సంప్రదింపుల కమిటీ సమావేశం
- హకీంపేటకు చెందిన 114 మంది రైతులతో సంప్రదింపులు
- భూములిచ్చిన రైతులకు ఎకరాకు రూ. 20 లక్షలు, 150 గజాల ఇంటి స్థలం ఇస్తామని హామీ
వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం హకీంపేట రైతులు, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సమావేశమయ్యారు. పారిశ్రామిక పార్కుకు భూములు ఇచ్చేందుకు సమ్మతించిన రైతులకు నష్టపరిహారం అందజేస్తామని ఆయన హామీ ఇచ్చారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లాస్థాయి సంప్రదింపుల కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా హకీంపేటకు చెందిన 114 మంది రైతులతో సంప్రదింపులు జరిపారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామంలో మొత్తం 164.34 ఎకరాల పట్టా భూమి ఉందని తెలిపారు. పారిశ్రామిక పార్కు కోసం భూములు ఇచ్చేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చిన రైతులతో ఒప్పందం చేసుకొని ముందుకు వెళతామని వెల్లడించారు. జిల్లాస్థాయి సంప్రదింపుల కమిటీ నిర్ణయం ప్రకారమే అవార్డు, చెక్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుందని స్పష్టం చేశారు.
సమ్మతి అవార్డు పొందిన రైతులకు ఒకే విడతలో చెక్కుల ద్వారా నష్టపరిహారాన్ని అందిస్తామని తెలిపారు. ఎకరాకు రూ. 20 లక్షలు, 150 గజాల ఇంటి స్థలంలో ఇందిరమ్మ ఇల్లు, అర్హత మేరకు ఇంటికో ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో కలెక్టర్‌తో పాటు అదనపు కలెక్టర్, తాండూరు సబ్ కలెక్టర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.