Thanuja Rani: పార్లమెంటులో అరకు కాఫీ స్టాల్ ప్రారంభోత్సవానికి నన్ను పిలవలేదు: వైసీపీ ఎంపీ తనూజా రాణి

- ఇటీవల పార్లమెంటులో అరకు కాఫీ స్టాల్ ఏర్పాటు
- అరకు ఎంపీనైన తనను పిలవలేదంటూ తనూజా రాణి ఆగ్రహం
- ఇది తనను అవమానించడమేనని వెల్లడి
- లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేస్తామని స్పష్టీకరణ
ఇటీవల పార్లమెంటు ప్రాంగణంలో అరకు కాఫీ స్టాల్ ఏర్పాటు చేయడం తెలిసిందే. కూటమి ఎంపీల విజ్ఞప్తితో అరకు ఆర్గానిక్ కాఫీ స్టాల్ ఏర్పాటుకు లోక్ సభ స్పీకర్ అనుమతి ఇచ్చారు. కొన్నిరోజుల కిందటే ఈ కాఫీ స్టాల్ ప్రారంభమైంది.
అయితే, పార్లమెంటులో అరకు కాఫీ స్టాల్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగిందని వైసీపీ ఎంపీ తనూజా రాణి అంటున్నారు. అరకు కాఫీ స్టాల్ ప్రారంభోత్సవానికి తనను పిలవలేవని ఆమె ఆరోపించారు. అరకు నియోజకవర్గ ఎంపీనైన తనను పిలవకపోవడం ఏంటని ప్రశ్నించారు. ఇది కచ్చితంగా తనను అవమానించడమేనని తనూజా రాణి ఆగ్రహం వ్యక్తం చేశారు.
పార్టీలకు అతీతంగా వ్యవహరించాల్సిన కార్యక్రమంలో ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగిందని, దీనిపై లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఒక ఎంపీగా ఉన్న తననే పట్టించుకోని నేతలు ఇక ప్రజలను ఏం పట్టించుకుంటారని తనూజా రాణి విమర్శించారు.