PM Kisan Samman: పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అనర్హుల నుంచి రూ. 416 కోట్లు రికవరీ

- అనర్హుల ఏరివేతకు సంబంధించి చర్యలు చేపడుతున్న కేంద్ర ప్రభుత్వం
- ఆధార్, ఆదాయపుపన్ను, ఆర్థిక మంత్రిత్వ శాఖల సమాచారంతో అనర్హుల ఏరివేత కార్యక్రమం
- ఐటీ చెల్లింపుదారులు, ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగుల నుంచి రికవరీ
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అనర్హుల నుంచి రూ. 416 కోట్లు రికవరీ చేసినట్లు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు. ఈ పథకంలో అనర్హుల ఏరివేతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో లోక్‌సభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
పీఎం కిసాన్ పథకం ద్వారా అర్హులైన రైతులకు ఏడాదికి రూ. 6 వేలను మూడు విడతల్లో కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. 2019లో ఈ పథకం ప్రారంభం కాగా, ఇప్పటి వరకు 19 విడతల్లో రూ. 3.68 లక్షల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ పథకం ప్రారంభంలో స్వీయ ధృవీకరణ ఆధారంగా లబ్ధిదారుల పేర్ల నమోదుకు అనుమతించారు. ఇప్పటికే 100 శాతం ఆధార్ సీడింగ్ పూర్తి చేయగా, ఆధార్, ఆదాయపన్ను శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖల వద్ద ఉన్న సమాచారంతో అనర్హులను ఏరివేసే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు.
ఈ క్రమంలో ఐటీ చెల్లింపుదారులు, ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, చట్టబద్ధ పదవుల్లో ఉన్నవారు ఈ పథకం కింద లబ్ధిపొందితే వారి నుంచి రికవరీ చేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించింది.
ఈ పథకం ద్వారా లబ్ధి పొందే రైతుల కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, పీఎం కిసాన్ ఆన్‌లైన్ పోర్టల్‌లో స్వయంగా రిజిస్టర్ చేసుకోవచ్చని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి తెలిపారు.