HYDRA: హైదరాబాద్‌లో అగ్ని ప్రమాదాలు, ట్రాఫిక్ జామ్ లు... హైడ్రా, జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం

- సంయుక్తంగా రెండు కమిటీలు వేయాలని హైడ్రా, జీహెచ్ఎంసీ నిర్ణయం
- అగ్నిమాపక శాఖతో కలిసి అగ్ని ప్రమాదాలపై ఒక కమిటీని వేయాలని నిర్ణయం
- వరద ముంపు నివారణతో పాటు ట్రాఫిక్ సమస్యలపై మరో కమిటీ వేయాలని నిర్ణయం
హైడ్రా, జీహెచ్ఎంసీ సంయుక్తంగా హైదరాబాద్ నగరంలో రెండు కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. నగరంలో వరుసగా జరుగుతున్న అగ్ని ప్రమాదాలు, వర్షాకాలంలో ఎదురయ్యే వరద ముంపు నివారణకు పరిష్కారం కనుగొనేందుకు జీహెచ్ఎంసీ, హైడ్రా కలిసి ఈ కమిటీలను వేయాలని నిర్ణయించాయి.
వరద ముంపుతో పాటు అగ్ని ప్రమాదాలకు ఆస్కారం లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. ఈ మేరకు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో అధికారులు, సిబ్బందితో హైడ్రా కమిషనర్ రంగనాథ్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి సమావేశమయ్యారు.
వర్షాకాలంలో తీసుకోవాల్సిన చర్యలు, అగ్నిప్రమాదాల నివారణపై సమీక్ష జరిపారు. అగ్ని ప్రమాదాల నివారణకు అగ్నిమాపక శాఖతో పాటు హైడ్రా, జీహెచ్ఎంసీ విభాగాలతో కలిసి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వర్షాకాలంలో వరద ముంపు నివారణతో పాటు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూసేందుకు ట్రాఫిక్, హైడ్రా, జీహెచ్ఎంసీ అధికారులతో మరో కమిటీని వేయాలని నిర్ణయించారు.