Neera Cafe: ట్యాంక్‌బండ్ నీరా కేఫ్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

- నీరా కేఫ్‌ను కల్లుగీత పారిశ్రామిక కార్పొరేషన్‌కు అప్పగిస్తూ జీఓ జారీ
- పర్యాటక శాఖ నుంచి రాష్ట్ర కల్లుగీత పారిశ్రామిక కార్పొరేషన్‌కు బదిలీ
- సీఎంకు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, టీపీసీసీ కల్లుగీత విభాగం అధ్యక్షుడు నాగరాజు గౌడ్ థ్యాంక్స్
ట్యాంక్‌బండ్ పీపుల్స్ ప్లాజాలో నెలకొల్పిన నీరా కేఫ్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. నీరా కేఫ్‌ను కల్లుగీత పారిశ్రామిక కార్పొరేషన్‌కు అప్పగిస్తూ జీఓ జారీ చేసింది. ప్రభుత్వం ఎక్సైజ్, పర్యాటక శాఖలతో సంప్రదింపులు జరిపిన తర్వాత నీరా కేఫ్‌ను పర్యాటక శాఖ నుంచి రాష్ట్ర కల్లుగీత పారిశ్రామిక కార్పొరేషన్‌కు బదిలీ చేసింది.
దీంతో ఈ నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఎమ్మెల్సీ, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, టీపీసీసీ కల్లుగీత విభాగం అధ్యక్షుడు నాగరాజు గౌడ్ ధన్యవాదాలు తెలిపారు.
ఇదిలా ఉంటే... సుమారు రూ.12 కోట్ల వ్యయంతో అత్యాధునిక వసతులతో నీరా కేఫ్‌ను కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈత మొద్దులు, తాటిమొద్దులపై కూర్చోడానికి వీలుగా సీట్లను డిజైన్ చేశారు. వాటిపై కూర్చుని ముచ్చట్లు చెప్పుకుంటూ నీరా తాగడానికి ఇక్కడికి జనాలు వస్తుంటారు. ఇక్కడి ఫుడ్ స్టాల్‌లో తెలంగాణ వంటకాలను సైతం వడ్డిస్తారు. గీతకార్మికుల అస్తిత్వానికి ప్రతీకగా ఈ నీరాకేఫ్ ఉంది. ఇతర పానీయాలతో పోల్చితే నీరా ఆరోగ్యానికి ఎంతో మంచిదనేది వైద్య నిపుణుల మాట.